- విమెన్ కోటా కోసం శాయశక్తులా ప్రయత్నించాం: ప్రధాని మోదీ
- దేశంలోని మహిళల కలలను ప్రతిపక్ష పార్టీలు చిదిమేశాయి
- స్త్రీలు దేనినైనా మరిచిపోతారు కానీ.. తమకు జరిగిన అవమానాన్ని కాదు
- ఈ పాపానికి ప్రతిపక్షాలు తగిన శిక్ష అనుభవించక తప్పదు
- మాకు 66% ఓట్లు లేకపోవచ్చు, కానీ 100% మహిళల మద్దతుందన్న ప్రధాని
- మహిళా కోటా చట్ట సవరణ బిల్లు వీగిపోవడంపై జాతిని ఉద్దేశించి ప్రసంగం
పార్లమెంటులో బిల్లు ఓడిపోతుంటే కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, సమాజ్ వాదీ పార్టీల నాయకులు.. దేశ మహిళలకు దక్కాల్సిన హక్కులను లాగేసుకుంటూ చప్పట్లు కొట్టారు. ఇది మహిళల ఆత్మగౌరవంపై జరిగిన దాడి. మహిళా రిజర్వేషన్లపై ఆశలు ఆవిరైనప్పుడు పార్లమెంటు హాలులో సంబరాలు చేసుకున్న ప్రతిపక్ష నాయకులను మహిళలు కచ్చితంగా శిక్షిస్తారు.
ప్రధాని
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందకుండా ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘మేం శాయశక్తులా ప్రయత్నించినా, విజయం సాధించలేకపోయాం.. ఇందుకుగాను దేశంలోని తల్లులందరికీ, ఈ దేశానికీ క్షమాపణలు చెప్తున్నా” అని తెలిపారు. శుక్రవారం లోక్ సభలో నారీ శక్తి వందన్ అధినియమ్ (మహిళా రిజర్వేషన్ చట్టం) సవరణ కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో శనివారం సాయంత్రం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు మహిళల కలలను ‘‘నిర్దాక్షిణ్యంగా చిదిమేశాయి’’ అని మండిపడ్డారు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్వాదీలాంటి పార్టీలకు మహిళల ప్రయోజనాల కంటే స్వార్థపూరిత రాజకీయాలే ఎక్కువయ్యాయన్నారు. ఈ బిల్లును వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీలు మహిళా శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నాయని అన్నారు.
మహిళా సాధికారతకు వ్యతిరేకంగా కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకేలాంటి పార్టీలు తమ ‘‘స్వార్థ రాజకీయాలతో ఎలా వేడుకలు చేసుకున్నాయో’’ మహిళలంతా చూశారని తెలిపారు. ‘‘మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడం ద్వారా ప్రతిపక్షాలు పాపం చేశాయి. దీనికి వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. బిల్లును ఓడించడం ద్వారా ఆ పార్టీలు రాజ్యాంగాన్ని అవమానించాయి’’ అని మోదీ విమర్శించారు.
"కాంగ్రెస్ తన పాత తప్పులను సరిదిద్దుకుంటుందని ఆశించాను. కానీ కొత్త చరిత్రను లిఖించే అవకాశాన్ని అది జారవిడుచుకుంది. మహిళలు ముందుకు సాగాలని కుటుంబ పార్టీలు కోరుకోవడం లేదు. ఎందుకంటే అది వారి స్వార్థ రాజకీయాలకు ముగింపు పలకవచ్చు" అని ప్రధాని వ్యాఖ్యానించారు.
బిల్లు వీగితే వేడుకలు చేసుకున్నారు..
మహిళా కోటా చట్టం సవరణ బిల్లు వీగిపోతే.. ప్రతిపక్షాలు వేడుకలు చేసుకోవడం తనను బాధించిందని ప్రధాని మోదీ అన్నారు. "మాకు దేశ ప్రయోజనాలే పరమావధి. కానీ కొందరు జాతీయ ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చినప్పుడు.. మహిళలు, దేశం దాని పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుంది. ఈసారి కూడా అదే జరిగింది. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీల స్వార్థ రాజకీయాల వల్ల దేశ మహిళలు నష్టపోయారు" అని అన్నారు.
‘‘పార్లమెంటులో బిల్లు ఓడిపోతుంటే కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, సమాజ్ వాదీ పార్టీల నాయకులు.. దేశ మహిళలకు దక్కాల్సిన హక్కులను లాగేసుకుంటూ చప్పట్లు కొట్టారు. ఇది మహిళల ఆత్మగౌరవంపై జరిగిన దాడి” అని అన్నారు. "మహిళా రిజర్వేషన్లపై ఆశలు ఆవిరైనప్పుడు పార్లమెంటు హాలులో సంబరాలు చేసుకున్న ప్రతిపక్ష నాయకులను మహిళలు కచ్చితంగా శిక్షిస్తారు" అని ఆయన హెచ్చరించారు. "స్త్రీ ప్రతిదీ మరచిపోతుంది. కానీ తనకు జరిగే అవమానాన్ని మాత్రం మర్చిపోదు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేసిన ఈ అవమానం ప్రతి మహిళ హృదయంలో ఎప్పటికీ ఉండిపోతుంది" అని అన్నారు.
మాకు 66% ఓట్లు లేకపోవచ్చు కానీ..
ప్రతిపక్షాల స్వార్థ రాజకీయాలు మహిళల హక్కులను దోచుకున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. "బిల్లును ఆమోదించడానికి అవసరమైన 66 శాతం ఓట్లు మాకు రాకపోయినప్పటికీ, దేశంలోని 100 శాతం మహిళల మద్దతు మాకు ఉందని నాకు తెలుసు" అని అన్నారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని.. ఉత్తర-, దక్షిణ విభజన గురించి అది అబద్ధాలను ప్రచారం చేస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు.
"ఈ సవరణ ఎప్పుడూ ఎవరి నుంచి ఏదీ లాక్కోవడానికి ఉద్దేశించింది కాదు. ఇది ఇవ్వడానికి ఉద్దేశించిన ప్రక్రియ. 40 ఏళ్లుగా మహిళలకు నిరాకరించిన హక్కులను చివరకు వారికి ప్రసాదించడానికి, ఆ హక్కులు 2029 నాటి తదుపరి లోక్‌సభ ఎన్నికల నాటికి అమలయ్యేలా చూడటానికి చేసిన పవిత్ర ప్రయత్నం ఇది" అని తెలిపారు.
కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు "ఈ నిజాయతీ ప్రయత్నాన్ని భ్రూణహత్య చేశాయి" అని మోదీ అన్నారు. వారు రాజ్యాంగానికి, ఈ దేశ మహిళా శక్తికి వ్యతిరేకంగా నేరానికి పాల్పడ్డారని మండిపడ్డారు. నారీ శక్తి వందన్ అధినియమ్‌కు చేసిన సవరణ నేటి కాలానికి అవసరమని.. అది ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో సమతుల్య సాధికారతను సాధించడానికి చేసిన నిజాయతీ ప్రయత్నమని మోదీ అన్నారు. కానీ, దేశ నిర్మాణం, అభివృద్ధి కోసం చేసే అన్ని ప్రయత్నాలను కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటుందన్నారు.

