ప్రవళిక క్యారెక్టర్​ను బద్నాం చేస్తున్నరు: డాలీ శర్మ

ప్రవళిక క్యారెక్టర్​ను బద్నాం చేస్తున్నరు: డాలీ శర్మ
  • ఆమెది ప్రభుత్వ హత్యే: డాలీ శర్మ
  • కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఫైర్

హైదరాబాద్, వెలుగు: ప్రవళికది ప్రభుత్వం చేసిన హత్య అని కాంగ్రెస్ జాతీయ నాయకురాలు డాలీ శర్మ ఆరోపించారు. ప్రవళిక ఫ్యామిలీని పరామర్శించే ధైర్యం కేసీఆర్​కు ఉందా అని ప్రశ్నించారు. ఉద్యోగం రాదేమోనన్న బెంగతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే.. ఆమె క్యారెక్టర్​ను బద్నాం చేసేలా పోలీసులు, ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డారు. ప్రవళిక అసలు గ్రూప్స్​కే అప్లై చేసుకోలేదన్న మంత్రి కేటీఆర్​పై ఆమె ఫైర్ అయ్యారు. ప్రవళిక గ్రూప్స్​కు అప్లై చేసుకున్న హాల్ టికెట్లను చూపించారు. సోమవారం గాంధీభవన్​లో పార్టీ లీడర్లు అలీ మెహదీ, రియాజ్​తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. 

కేసీఆర్ నియంతలా తమాషాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రవళిక ఇంటికి వెళ్లి చూశామని, వారి పరిస్థితి బాగాలేదని చెప్పారు. రాష్ట్రంలోని చాలా మంది పరిస్థితి ఇలాగే ఉందన్నారు. తల్లిదండ్రులు రెండు పూటల భోజనం కూడా చేయకుండా పిల్లలను హైదరాబాద్​కు పంపి చదివిస్తుంటే.. తల్లిదండ్రుల కష్టాలు చూడలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. పిల్లల చదువులు, ఉద్యోగాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఇది సిగ్గు పడాల్సిన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరపకుండానే ప్రవళికకు బాయ్​ఫ్రెండ్ ఉన్నాడని ఆరోపణలు చేయడం ఆమెను అవమానించడమే అవుతుందని అలీ మెహదీ మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబానికి ఓ మహిళ పడే బాధ తెలియడం లేదన్నారు. కవిత లిక్కర్​ కేసులో అరెస్ట్ అవుతుందని ఎంతో బాధపడిన కేసీఆర్​.. ఒక పేద బిడ్డ ఆవేదనను ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. 

యువతను హేళన చేసింది

రాష్ట్ర యువతను బలిగొంటున్న కేసీఆర్ పింక్ పార్టీ.. ఇప్పుడు ఏకంగా తెలంగాణ ఆడబిడ్డ ఆత్మహత్యను అవమానించి యువతను హేళన చేసిందని కాంగ్రెస్​ పార్టీ మండిపడింది. ప్రవళిక ఆత్మహత్యను తప్పుదారి పట్టించేందుకు ఆమె క్యారెక్టర్​పై అసత్యాలు ప్రచారం చేయడం కేటీఆర్​కే చెల్లిందని పేర్కొంది. కేటీఆర్ కామెంట్లకు సోమవారం ట్విట్టర్​లో పార్టీ కౌంటర్ ఇచ్చింది. అమ్మాయి క్యారెక్టర్​పై తమ అనుకూల మీడియా ద్వారా బీఆర్ఎస్ అసత్యాలు ప్రచారం చేయించిందని పేర్కొంది.