న్యూఢిల్లీ: ఇండియా-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో ఇండియా-అమెరికా ట్రేడ్ డీల్‌కు సంబంధించి వివరాలను తెలియజేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌లో కాంగ్రెస్ వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేసీ వేణుగోపాల్ మంగళవారం (ఫిబ్రవరి 3) లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చారు.
వాణిజ్య ఒప్పందంలోని వ్యవసాయం, ముడి చమురు కొనుగోళ్ల సుంకాలపై ప్రభుత్వం వివరించాలని కోరారు. దేశ ఆర్థిక, వ్యవసాయ, వ్యూహాత్మక రంగాలపై తీవ్ర ప్రభావం చూపే ఈ ఒప్పందంపై పార్లమెంట్‌లో తక్షణమే చర్చ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థతకు ఎంతో కీలకమైన ఈ ఒప్పందంపై లోక్ సభలోని మిగిలిన కార్యకలాపాలను పక్కన పెట్టి చర్చించాలని స్పీకర్‌ను కోరారు. మరీ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
భారత్‌తో ట్రేడ్ డీల్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకున్నారు. ఇండియాపై ప్రస్తుతం ఉన్న రెసిప్రోకల్ టారిఫ్‌లను 25 నుంచి 18 శాతానికి తగ్గించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. ‘‘భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న స్నేహం, ఆయనపై ఉన్న గౌరవం కారణంగా ఇండియాతో ట్రేడ్ డీల్‌కు మేం ఒప్పుకున్నాం.
అందుకోసం మోదీ నాకు రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇండియాపై రెసిప్రోకల్ టారిఫ్‌లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాం. అలాగే, రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపివేయడానికి భారత్ ఒప్పుకుంది. బదులుగా మా దగ్గరే వెనెజువెలా చమురును ఇండియా కొనుగోలు చేస్తుంది” అని ట్రంప్ పోస్టు చేశారు. తాను, మోదీ పనులు చేయించే లీడర్లమని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా నుంచి రూ.45 లక్షల కోట్ల (500 బిలియన్ యూఎస్ డాలర్లు) విలువైన ఎనర్జీ, టెక్నాలజీ, అగ్రికల్చర్‌తో పాటు ఇతర ఉత్పత్తుల కొనుగోలుకు కూడా మోదీ ఒప్పుకున్నారని, ఈ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో కట్టుబడి ఉంటామని మోదీ చెప్పారని ట్రంప్ వెల్లడించారు. అంతకుముందు మోదీకి ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారని ఇండియాకు అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. మోదీపై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారని ‘ఎక్స్’లో ఆయన చెప్పారు.
