
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ సర్కారు హెడ్ లైన్స్ కోసమే పని చేస్తోందని, డెడ్ లైన్స్ కోసం కాదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. వ్యాక్సిన్ పాలసీపై చర్చించేందుకు వెంటనే పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్లు అందించేందుకు అనుసరిస్తున్న రోడ్ మ్యాప్ పై పార్లమెంటులో స్పష్టత ఇవ్వాలంది. ప్రజలు వ్యాక్సిన్ల కోసం ప్రైవేటు హాస్పిటళ్లకు ఎందుకు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వస్తోందని ప్రశ్నించింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో వర్చువల్ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ లీడర్ జైరాం రమేశ్ మాట్లాడారు. ప్రతి ఇండియన్ కు ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని, చాలా మందికి డిజిటల్ యాక్సెస్ లేనందున కొవిన్ యాప్ ను వినియోగించలేరని, రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేయరాదని అన్నారు. వ్యాక్సినేషన్ పాలసీపై పార్లమెంటులో చర్చించాలని, అందరికీ వ్యాక్సిన్ వేసేందుకు ప్రత్యేక బడ్జెట్ కు ఆమోదం తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్ల కేటాయింపులో ట్రాన్స్ పరెన్సీ ఉండాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ల పంపిణీలో ఎలాంటి వివక్ష చూపరాదని అన్నారు.
సుప్రీం జోక్యంతోనే మోడీ నిద్ర లేచారు..
వ్యాక్సినేషన్ పై సుప్రీంకోర్టు జోక్యంతోనే మోడీ కుంభకర్ణుడి నిద్ర నుంచి లేచారని జైరాం రమేశ్ అన్నారు. కరోనా క్రైసిస్ ను ఎదుర్కొనేందుకు అందరూ కలిసి పోరాడాలని, అయితే ఒక వ్యక్తి వైఫల్యాలు, ఈగో వల్ల దేశం మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తోందని మోడీపై మండిపడ్డారు. ' ఏప్రిల్ లో రోజుకు 30 లక్షల డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. మేలో అది 16 లక్షలకు తగ్గింది. జూన్ లో మళ్లీ రోజుకు 30 లక్షల డోసులు వేస్తున్నారు. అయితే డిసెంబర్ నాటికి వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి కావాలంటే రోజుకు 80 లక్షల మందికి టీకాలు వేయాలి. దీనికే కేంద్రం దగ్గర ఉన్న రోడ్ మ్యాప్ ఏంటీ? దీనిపై మోడీ ఎలాంటి వివరాలు చెప్పలేదు. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని, హెల్త్ మినిస్టర్ ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలి. రోజుకు 80 లక్షల మందికి టీకాలు వేసేలా వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచాలి' అని అన్నారు. అమెరికా, ఇంగ్లండ్ ఇలా ప్రపంచంలోని ఏ దేశంలోనూ వ్యాక్సిన్ల కోసం ప్రజలు డబ్బులు కట్టడం లేదన్నారు.