- ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపు
- పోటీ ఇవ్వని బీఆర్ఎస్
యాదాద్రి, వెలుగు: మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలను ఆ పార్టీ చేజిక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎక్కడా గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. బీజేపీ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. యాదాద్రి జిల్లాలో మేజర్ మున్సిపాలిటీ భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, మోత్కూరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో 104 వార్డులున్నాయి. వీటిలో రెండు వార్డులను ఏకగ్రీవంగా గెలుకొని ముందే ఖాతా తెరిచింది. ఆలేరు, మోత్కూరులో కొంత ఇబ్బంది ఉంటుందని మిగిలిన నాలుగు మున్సిపాలిటీలను పూర్తి మెజారిటీతో గెలుచుకుంటామని కాంగ్రెస్‌కు మొదటి నుంచి అంఛనాతో ఉంది.
అయితే ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆలేరుపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి అవసరమైన వార్డులను గెలుచుకునేలా ప్లాన్ వేసి సక్సెస్ అయ్యారు. మోత్కూరు మున్సిపాలిటీలో అభ్యర్థుల ఎంపిక సహా గెలుపు విషయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్సమన్వయంగా వ్యవహరించి గెలిపించుకున్నారు. భువనగిరి, భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీలపై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి అన్ని తానై వ్యవహరించి గెలుపు తీరాలకు చేర్చారు. చౌటుప్పల్మున్సిపాలిటీలో పూర్తిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూర్తిగా పట్టుబిగించి గెలుచుకున్నారు.
చతికిలబడిన బీఆర్ఎస్
గత ఎన్నికల్లో ఆరు మున్సిపాలిటీల్లో మూడింటిలో ఎక్స్ అఫిషియో ఓట్లతో బీఆర్ఎస్ గెలుచుకుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది. యాదగిరిగుట్టలో కేవలం ఒక్క వార్డుకే పరిమితమైంది. 35 వార్డులున్న భువనగిరిలో కేవలం నాలుగింటిలో గెలిచింది. 104 వార్డులున్న ఆరు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కేవలం 18 వార్డులకే పరిమితమైంది.
ప్రభావం చూపని కమలం
గత ఎన్నికల్లో భువనగిరిలో 8 వార్డులను గెలుచుకున్న బీజేపీ, ఇప్పుడు నాలుగే గెలిచింది. యాదగిరిగుట్టలో రెండు వార్డులు గెలిచి ఖాతా తెరిచింది. ఆలేరులో గతంలో ఒకటి ఉండగా ఇప్పుడు రెండింటిలో గెలిచింది. మొత్తంగా మొత్తంగా 12 వార్డుల్లో బీజేపీ గెలిచింది. పొత్తులో భాగంగా సీపీఎం, సీపీఐ ఒక్కొక్క వార్డు గెలుచుకున్నాయి. ఏడు వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలిచారు.
యాదాద్రి జిల్లాలో
మున్సిపాలిటీ వార్డులు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సీపీఎం ఇతరులు
ఆలేరు 12 07 03 02 00 00
భువనగిరి 35 22 04 04 00 05
చౌటుప్పల్ 20 13 03 03 01 00
మోత్కూరు 12 08 03 00 00 01
పోచంపల్లి 13 06 05 01 00 01
యాదగిరిగుట్ట 12 08 01 02 01(సీపీఐ) 00
