రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‭ఛార్జ్ పదవికి అజయ్ మాకెన్ రాజీనామా

రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‭ఛార్జ్ పదవికి అజయ్ మాకెన్ రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్ నేత అజయ్ మాకెన్ షాకిచ్చారు. రాజస్థాన్ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌  నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అజయ్‌ మాకెన్‌  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. రాజస్థాన్ కాంగ్రెస్‭లో నెలకొన్న  విభేదాలను పరిష్కరించలేకపోవడానికి బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో.. సెప్టెంబర్ 25న నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశానికి గెహ్లాట్ వర్గంలోని కొందరు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అజయ్ పార్టీ అధిష్టానానికి సూచించారు. అయితే.. దీనిపై ఇప్పటివరకు పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ కారణంగానే అజయ్ మాకెన్ తన పదవికి రాజీనామా చేసినట్లు పార్టీలోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. 

మరోవైపు పార్టీలో నెలకొన్న విభేదాలను త్వరగా పరిష్కరించాలని కొద్దిరోజుల క్రితం సచిన్‌ పైలట్‌ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మాకెన్ రాజీనామా కాంగ్రెస్ పార్టీకి కొత్త సమస్యగా మారింది. ఇక.. మరో రెండు వారాల్లో రాహుల్‌ గాంధీ జోడో యాత్ర రాజస్థాన్‌లోకి ప్రవేశించనున్న నేపథ్యంలో మాకెన్‌ రాజీనామా పార్టీలో కలకలం రేపుతోంది.