పంజాగుట్ట, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్ ను బద్నాం చేసేందుకు కొందరు కట్ర చేస్తున్నారని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పురం పురుషోత్తం విమర్శించారు. ఆదివారం ఎర్రమంజిల్‌లోని ఓ హోటల్ లో సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండ దేవయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. బడుగు, బలహీనవర్గాలకు చెందిన నాయకుడిగా రాజకీయంగా ఎదుగుతున్న బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టపరంగా శిక్ష పడాల్సిందేనని తెలిపారు.
ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున, ఆ నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విషయంపై దుష్ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. బండి సంజయ్‌పై అనవసర ఆరోపణలు చేయడం తగదని, ఆయన ప్రతిష్టను దెబ్బతీసే ప్రచారాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. సంఘం నాయకులు మంగళారపు లక్ష్మణ్, దేశం శ్రీధర్, శివరాజులు, రాజేశ్వర్, పురం శ్రీనివాస్, పెద్దన్న పాల్గొన్నారు.
