ఆర్టీసీలో రోజురోజుకూ ముదురుతున్న జేఏసీల లొల్లి

ఆర్టీసీలో రోజురోజుకూ ముదురుతున్న జేఏసీల లొల్లి
  • 3 యూనియన్లు, 3 జేఏసీలతో యూనిటీ నిల్
  • ఒకే జేఏసీకి ముందుకు రాని సంఘాలు
  • పరిష్కారానికి నోచుకోని సమస్యలు
  • ఫైర్ అవుతున్న కార్మికులు


హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీలో జేఏసీల లొల్లి రోజురోజుకూ ముదురుతోంది. ప్రస్తుతం మూడు యూనియన్లు, మూడు జేఏసీలు కొనసాగుతున్నాయి. కీలకమైన నాలుగు యూనియన్లు ఏకం కాకపోవటం కార్మికుల సమస్యల పరిష్కారంపై ఎఫెక్ట్​చూపుతోందనే చర్చ జరుగుతోంది. ఆర్టీసీలో ప్రస్తుతం టీఎంయూలో రెండు (అశ్వత్థామరెడ్డి వర్గం) (థామస్ రెడ్డి వర్గం)  వర్గాలు ఉండగా, లెఫ్ట్ పార్టీల అనుబంధ యూనియన్లు ఎంప్లాయీస్ యూనియన్, ఎస్ డబ్ల్యూఎఫ్, హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) ఉన్నాయి. ఇవి కాక మరో 5, 6 చిన్న యూనియన్లు ఉన్నాయి. టీఎంయూ థామస్ రెడ్డి వర్గం ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తోంది. ఇక టీఎంయూ జనరల్ సెక్రటరీగా ఉన్న అశ్వత్థామరెడ్డి యూనియన్ కు, ఆర్టీసీ ఉద్యోగానికి రిజైన్​ చేసి బీజేపీలో చేరారు. గత కొద్ది నెలల నుంచి టీఎంయూ గౌరవ అధ్యక్షుడిగా ఆర్టీసీలో కీలకమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  గతంలో ఈయూ, ఎస్ డబ్ల్యూ ఎఫ్, టీజేఎంయూతో పాటు ఇతర యూనియన్లు జేఏసీగా ఏర్పడ్డాయి. మునుగోడు బై పోల్ టైమ్ లో ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి మునుగోడు ఉద్యోగుల సమాఖ్యను ఏర్పాటు చేయటంతో టీజేఎంయూ జేఏసీ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు టీజేఎంయూ, ఈయూ రెండు జేఏసీలను నడిపిస్తున్నాయి. ఇటీవల అందరం కలిసి కొత్త జేఏసీ ఏర్పాటు చేద్దామని అశ్వత్థామరెడ్డి  పిలుపునివ్వగా ఇందుకు ఈయూ, టీజేఎంయూ, ఎస్ డబ్ల్యూ ఎఫ్  దూరంగా ఉంటున్నాయి.

ఎక్కడి సమస్యలు అక్కడే 

ఓ వైపు యూనియన్ల లొల్లి, మరోవైపు ప్రభుత్వ ఉదాసీనతతో ఆర్టీసీలో సమస్యలు ఎక్కడిక్కడే పేరుకుపోతున్నాయి. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చొరవ చూపకపోవటం.. ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న యూనియన్ సైతం వినతిపత్రాలకే పరిమితవుతుండడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు బైఎలక్షన్ ముందు మంత్రులు యూనియన్లతో మీటింగ్ లు నిర్వహించి సాల్వ్ చేస్తామని హడావుడి చేసి ఇప్పుడు పట్టించుకోకపోవటంపై  మండిపడుతున్నారు. కార్మికులకు 2017, 2021 పీఆర్సీలు బకాయిలు రావాల్సి ఉంది. 2012 పీఆర్సీకి 50 శాతం బాండ్లు పెండింగ్ లో ఉన్నాయి.  పీఎఫ్ ట్రస్ట్ కు రూ.1500 కోట్లు, సీసీఎస్ కు రూ.960 కోట్లు కట్టాల్సి ఉంది. సీసీఎస్ కు మేనేజ్ మెంట్ బకాయి ఉండటంతో గత రెండేండ్లుగా కార్మికులకు లోన్లు దొరకటం లేదు. దీంతో  పిల్లలఉన్నత చదువులు, పెండ్లీలు, ఇండ్ల నిర్మాణానికి వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల  నుంచి ఎక్కువ వడ్డీకి లోన్లు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీలోని యూనియన్లన్నీ యూనిటీగా ఒకే జేఏసీగా ఏర్పడి పోరాటాలు చేస్తేనే ప్రభుత్వం, మేనేజ్ మెంట్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయని కార్మికులు అభిప్రాయపడుతున్నారు.

సర్కారుకు అవకాశంగా మారిన యూనియన్ల లొల్లి 

ఆర్టీసీలో కీలకంగా ఉన్న నాలుగు యూనియన్లు ఏకం కాకపోవటం ఇటు సర్కారుకు.. అటు మేనేజ్ మెంట్ కు అనుకూలంగా మారిందని గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న టీఎంయూ రెండు వర్గాలుగా చీలిపోవటం, యూనియన్ అంశం హైకోర్టు పరిధిలో ఉండటం తదితర అంశాలను ప్రభుత్వం గమనిస్తోంది. లెఫ్ట్ పార్టీలకు అనుబంధంగా ఉన్న రెండు యూనియన్లు కూడా తమకు మద్దతు ఇస్తున్నట్లుగా ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల ఓ మంత్రి సైతం ఆ యూనియన్లు కూడా మాకు ముఖ్యమే అని ఓ మీటింగ్ లో అన్నట్లు చర్చ జరుగుతోంది.