అప్పుల బాధతో తల్లిదండ్రుల ఐపీ..చదువుల కోసం కొడుకు లిక్కర్ దందా!

అప్పుల బాధతో తల్లిదండ్రుల ఐపీ..చదువుల కోసం కొడుకు లిక్కర్ దందా!

హైదరాబాద్ సిటీ/నారాయణగూడు, వెలుగు:  ఓ కుటుంబంలో తల్లిదండ్రుల అప్పుల బాధతో ఐపీ పెట్టగా, బీటెక్​చేస్తున్న కొడుకు చదువుకోవడానికి డబ్బులు లేక లిక్కర్​బిజినెస్​లోకి దిగాడు. అక్రమ మద్యం అమ్ముతూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. నగరానికి చెందిన మనకాల చరణ్ (22) చంఢీగఢ్ లో బీటెక్ చేస్తున్నాడు. 

తల్లిదండ్రులకు పలు వ్యాపారాలు ఉండడంతో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఉండేవి కావు. చిన్నప్పటి నుంచి చదువు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది. అయితే, కొద్ది కాలం కింద తల్లిదండ్రులు బిజినెస్​లో లాస్​వచ్చింది. దీంతో వారు ఐపీ పెట్టారు. చంఢీగడ్​లో ఉన్న చరణ్​ను ఆర్థిక కష్టాలు వెంటాడాయి. అకడమిక్​కు, హాస్టల్​కు డబ్బులు కట్టేందుకు కూడా లేకపోవడంతో ఏం చేయాలా అని ఆలోచించాడు. 

చంఢీగడ్​నుంచి ఖరీదైన లిక్కర్​తీసుకువచ్చి హైదరాబాద్​లో అమ్మితే కష్టాలు తీరతాయని చెప్పారు. దీంతో అతడు నాన్​డ్యూటీ పెయిడ్​లిక్కర్​ను తీసుకువచ్చి హైదరాబాద్ లో అమ్మడం మొదలుపెట్టాడు. చివాస్ రీగల్, జానీవాకర్ బ్రాండ్స్​తీసుకువచ్చి వైఎంసీఏ శాంతి  థియేటర్ దగ్గర అమ్ముతుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.

అతడి నుంచి 15 బాటిల్స్​స్వాధీనం చేసుకున్నారు. నెలకు రెండు సార్లు ఏడు  నుంచి 10 బాటిల్స్​తీసుకువచ్చి అమ్ముతానని, ఆ డబ్బులతోనే తన చదువు సాగుతోందని చెప్పడంతో ఎక్సైజ్​పోలీసులు చలించిపోయారు. కానీ వృత్తి ధర్మం ప్రకారం నిందితుడిని అదుపులోకి తీసుకుని మద్యం  బాటిళ్లను, స్కూటీని నారాయణగూడ ఎక్సైజ్ స్టేషన్‌‌లో అప్పగించామని అసిస్టెంట్​ఎక్సైజ్​సూపరింటెండెంట్​శ్రీనివాసరావు, ఎక్సైజ్ డిస్ట్రిక్ట్​టాస్క్​ఫోర్స్​సీఐ సౌజన్య తెలిపారు.