విజయ్ స్టార్‌డమ్ వెనుక ఆర్‌బీ చౌదరి.. ఒక్కో సినిమా 250 రోజులకు పైగా థియేటర్లలో.. సీఎం అయ్యే టైంలోనే..

విజయ్ స్టార్‌డమ్ వెనుక ఆర్‌బీ చౌదరి.. ఒక్కో సినిమా 250 రోజులకు పైగా థియేటర్లలో.. సీఎం అయ్యే టైంలోనే..

నిర్మాత ఆర్.బి. చౌదరి ఆకస్మిక మరణం సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దిగ్గజ ఫిల్మ్ మేకర్ ఇండియన్ సినీ పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన నిర్మాతల్లో ఒకరు. కేవలం విజయవంతమైన నిర్మాత మాత్రమే కాదు. భావోద్వేగం, వినోదం, కమర్షియల్ అంశాలను సమతుల్యం చేసే చిత్రాలను నిర్మిస్తూ, పరిశ్రమలో విశ్వసనీయ పేరుగా ఎదిగారు ఆర్.బి. చౌదరి(R B Choudary).

అయితే, ప్రస్తుతం తమిళనాట ప్రభంజనం సృష్టించిన విజయ్ సినీ కెరీర్‌కి స్టార్‌డమ్‌ తెప్పించడంలో ఆర్.బి. చౌదరి కీలక పాత్ర పోషించాడు. 1996లో విడుదలైన ‘పూవే ఉనక్కగా’, ‘తుళ్ళధ మనముం తళ్ళుం’, ‘తిరుపాచ్చి’ వంటి కెరీర్‌‌ బెస్ట్ చిత్రాలను అందించారు ఆర్‌‌బీ చౌదరి. ‘పూవే ఉనక్కగా’ మూవీ క్లాసిక్ రొమాంటిక్ చిత్రంగా నిలిచింది. ఇది విజయ్ కెరీర్‌లో తొలి భారీ విజయంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీ దాదాపు 270 రోజులకు పైగా థియేటర్లలో ప్రదర్శించబడింది.

ఈ సినిమానే తెలుగులో జగపతి బాబుతో ‘‘శుభాకాంక్షలు’’ టైటిల్తో రీమేక్ చేసి హిట్ కొట్టారు. తిరుపాచ్చి మూవీని విజయ్, త్రిషలతో తెరకెక్కించి మరోసారి సూపర్ హిట్ కొట్టారు. ఇది తెలుగులో అన్నవరంగా రిలీజై బ్లాక్ బస్టర్ అయింది. అలా దళపతి విజయ్ సినీ స్టార్‌డమ్‌కి ఆర్.బి. చౌదరి కీలక పాత్ర పోషించారు. అలాంటిది విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న సమయంలోనే, ఆయన మరణించడం దళపతికి తీవ్ర భావోద్వేగాన్ని కలిగిస్తుంది.

కొత్త ప్రతిభకు అవకాశాలు..

ఆర్.బి. చౌదరి కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో ముందుండేవారు. సినీ పరిశ్రమ కొత్తవారిపై నమ్మకం లేని రోజుల్లో కూడా చాలా మందికి ఛాన్స్ ఇచ్చి మార్గదర్శకుడయ్యాడు. ఆయన తన కెరీర్ లో దాదాపు 44 మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇది మాములు విషయం కాదు. అందుకే ఆర్.బి. చౌదరి.. జీరో హీటర్స్ ప్రొడ్యూసర్ గా పేరుగాంచారు. వారిలో వసంతం మూవీ డైరెక్టర్ విక్రమన్, నరసింహ డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్, పందెంకోడి డైరెక్టర్ లింగుస్వామి, పెరరాసు, ఎజిల్, సాసి, రాజకుమార్ వంటి దర్శకులను తీర్చిదిద్దారు. 

100 సినిమాలకు ఒక్క అడుగు దూరంలో.. 

ఆర్.బి. చౌదరి దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో వంద సినిమాలకు చేరువైన అరుదైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. మొదట మలయాళంలో సినిమాలు నిర్మించిన ఆయన, అనంతరం తమిళం, తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి వరుస హిట్స్ అందించారు. అంతేందుకు 1990, 2000 దశకాల్లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌ ఓ మోత మోగేలా చేశాడు. తెలుగులో ‘సూర్యవంశం’, ‘సుస్వాగతం’, ‘రాజా’, ‘శీను’, ‘సింహరాశి’, ‘నువ్వు వస్తావని’, ‘నిన్నే ప్రేమిస్తా’, ‘ప్రియమైన నీకు’, ‘స్నేహమంటే ఇదేరా’, ‘శివరామరాజు’, ‘సంక్రాంతి’, ‘గోరింటాకు’ వంటి ఫీల్ గుడ్ ఫ్యామిలీ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు.

చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో కూడా సినిమాలు తీసి సూపర్ సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తన 99వ సినిమాని నిర్మిస్తున్నారు. విశాల్ హీరోగా ‘మకుటం’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే 100 వ సినిమాకు శ్రీకారం చుట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే ఇలా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. 

కుటుంబం మరియు వారసత్వం:

నిర్మాత ఆర్‌.బి.చౌదరి 1950లో మద్రాస్‌లో బి.ఆర్‌.చౌదరి, పార్వతి బాయి దంపతులకు జన్మించాడు. ఆయన మొదట ఉక్కు, ఆభరణాలు, ఎగుమతుల రంగాల్లో బిజినెస్ చేసి బాగా సంపాదించారు. ఆ తర్వాత సినిమాలను గల్ఫ్ దేశాల్లో పంపిణీ చేస్తూ సినీ రంగంతపై గ్రిప్ పెంచుకున్నారు. అనంతరం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి.. సక్సెస్ ఫుల్ నిర్మాతగా 40 ఏళ్ల నుంచి కొనసాగుతున్నారు. 

అయితే, ఆర్‌.బి. చౌదరి సినిమాలకే కాకుండా కుటుంబానికి కూడా ఆయన ఎంతో దగ్గరగా ఉండేవారు. ఆయనకు నలుగురు కుమారులు సురేశ్, జీవన్, జితన్‌ రమేశ్, జీవా. ఇందులో సురేశ్‌ సినీ నిర్మాణంలోనే కొనసాగుతుండగా, జావా హీరోగా రాణిస్తున్నారు. జీవన్‌ ఉక్కు కంపెనీని నిర్వహిస్తున్నారు. మూడో తనయుడు జితన్‌ రమేశ్‌ హీరోగా, నిర్మాతగా ప్రేక్షకులకు సుపరిచితం. ‘విద్యార్థి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్నీ పలకరించారు. ఇకపై సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్.. ఆయన వారసత్వం ద్వారా కొనసాగనుంది.