- ఇప్పటికే లొకేషన్ సర్వే పూర్తి చేసిన ఆఫీసర్లు
- రైల్వేలైన్ పొడవు296 కి.మీ., ప్రాజెక్టు అంచనా విలువ రూ.5,330 కోట్లు
మహబూబాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజా రవాణా అవసరాలకు అనుగుణంగా రైల్వే శాఖ కొత్త సౌకర్యాలు, మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా డోర్నకల్_ గద్వాల కొత్త రైలు మార్గం నిర్మాణ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్, సీరోలు, మరిపెడ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో రైలు కూత వినపడనుంది.
సికింద్రాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు మధ్య ఇప్పుడున్న రైల్వే లైన్ను అనుసంధానించేందుకు మరొక రైలు మార్గం అవసరమని భావించిన రైల్వేశాఖ ఇటీవల అధ్యయనం చేసింది. ఇందులో భాగమే డోర్నకల్_గద్వాల్ రైలు మార్గం నిర్మాణ ప్రతిపాదనకు బలం చేకూరింది. తాజాగా రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్ సభలో ప్రతిపాదిత డోర్నకల్_ గద్వాల రైలు మార్గం సర్వే పూర్తైనట్లు ప్రకటించడంతో ఈ ప్రాంతవాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
రైల్వే మార్గం ఇలా..
డోర్నకల్_గద్వాల్ రైల్వేలైన్ 296 కిలో మీటర్ల వరకు ఉండనుంది. దీనికి రూ.5,330 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేశారు. మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రైలు మార్గం లేని ప్రాంతాల నుంచి సూర్యాపేట, నల్గొండ, దేవరకొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల వరకు రైల్వే లైన్ సర్వేను చేపట్టారు. డీపీఆర్ పూర్తయ్యాక
రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నీతిఆయోగ్, ఆర్థిక శాఖలతో చర్చించి ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతి మంజూరు చేయనున్నారు.
బెంగుళూర్ మరింతగా దగ్గర..
డోర్నకల్_గద్వాల్ రైలు మార్గం పూర్తయితే సూర్యాపేట, నల్గొండ, వనపర్తి వెళ్లడానికి మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి జిల్లా ప్రజలు ఖమ్మం వెళ్లి ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. అధిక వ్యయ ప్రయాసలకు గురి కావాల్సి వస్తుంది. నూతన రైల్వే మార్గంతో ఉమ్మడి వరంగల్ ప్రజలకు బెంగళూరు మరింతగా దగ్గర కానుంది. వెనకబడిన ప్రాంతాలకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
కేంద్రం కొత్త ప్రాజెక్టును ఆమోదించాలి
సికింద్రాబాద్, విజయవాడ సెక్షన్ లో ఖాజీపేట తదుపరి రెండో అతిపెద్ద జంక్షన్ గా డోర్నకల్ అభివృద్ధి చెందాల్సి ఉంది. కొత్త రైలు మార్గం కార్యరూపం దాల్చితే చెన్నై, న్యూఢిల్లీ మార్గంలో రైల్వేశాఖకు డోర్నకల్ కేంద్ర బిందువుగా మారనుంది.
ప్రతిపాదిత డోర్నకల్_గద్వాల్ కొత్త రైలు మార్గం ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటుగా సూర్యాపేట, నల్గొండ, వనసర్తి, గద్వాల జిల్లా ప్రజలకు ప్రయోజనకరంగా మారనుంది. 2023 నుంచి ప్రతిపాదిత దశలో ఉంది. గతేడాది ఫైనల్ లొకేషన్ సర్వే ఓ కొలిక్కి వచ్చింది.
కాగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రిని త్వరలో కలువడంతో పాటుగా మారుమూల ప్రాంతాల అభ్యున్నతి దిశగా సహకరించడానికి కొత్త రైల్వే ప్రాజెక్టు విస్తరణ కోసం సత్వరం భూ సేకరణకు నిధులు కేటాయించాలని కోరతాం.
-మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్-
