- ఏజెన్సీల ప్రతినిధులు సహా 9 మందితో ఏర్పాటు
- మే చివరి కల్లా ఇన్వెస్టిగేషన్పూర్తి చేసేలా ప్రభుత్వ కసరత్తు
- టెస్టుల పురోగతిపై ప్రతి సోమ, గురువారం సమగ్ర నివేదిక
- ఢిల్లీలో ఎన్డీఎస్‌ఏ చైర్మన్అనిల్ జైన్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ
- బ్యారేజీల పునరుద్ధరణకు యాక్షన్ ప్లాన్‌పై చర్చ
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు వీలైనంత త్వరగా రిపేర్లు చేసి వినియోగంలోకి తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఇందుకోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఏజెన్సీల ప్రతినిధులు సహా తొమ్మిది మందికి స్థానం కల్పించింది.
ఈ కమిటీ ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు పనుల పురోగతిపై ఇరిగేషన్ సెక్రటరీకి రిపోర్టు సమర్పించాలని , ప్రతి సోమవారం, గురువారం సమగ్ర రిపోర్టులనూ అందజేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అలాగే ఎండాకాలం పూర్తయ్యేలోపు టెస్టులను పూర్తి చేయాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో శుక్రవారం ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) చైర్మన్ అనిల్ జైన్‌తో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, అధికారులు సమావేశమయ్యారు. బ్యారేజీల పునరుద్ధరణకు యాక్షన్ ప్లాన్‌పై చర్చించారు. గతంలో జరిగిన తప్పిదాలు రిపీట్ కాకుండా రిపేర్ల విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని అనిల్ జైన్‌కు మంత్రి ఉత్తమ్ వివరించారు. నిపుణుల సమక్షంలో బ్యారేజీలకు చేస్తున్న టెస్టులు, స్టడీలపై అనిల్ జైన్ సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే తాను బ్యారేజీలను పరిశీలిస్తానని చెప్పారు.
చైర్మన్‌గా పరీక్షిత్ మెహ్రా..
బ్యారేజీలు 10 కాలాలపాటు మన్నేలా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇందుకోసం నిపుణులు, ఏజెన్సీల ప్రతినిధులు సహా 9 మందితో స్పెషల్ కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. టన్నెల్స్ అండ్ సేఫ్టీ సెక్రటరీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
జాయింట్ సెక్రటరీ కె. శ్రీనివాస్, సీడీవో సీఈ ఎంఎస్‌ఎన్ రెడ్డి, సీడబ్ల్యూపీఆర్ఎస్ అడిషనల్ డైరెక్టర్ సెల్వబాలన్, ఆఫ్రీ ఇండియా ఎండీ సాయికృష్ణ, ఎల్అండ్ టీ జనరల్ మేనేజర్ సురేశ్ కుమార్, ఆఫ్కాన్స్ వైస్‌ప్రెసిడెంట్ మల్లికార్జునరావు, నవయుగ ప్రాజెక్ట్ మేనేజర్ మాధవ్‌ను మెంబర్లుగా, రామగుండం సీఈ టి. శ్రీనివాస్‌రావు గుప్తాను మెంబర్ కన్వీనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కమిటీకి అవసరమైన మేరకు సాయం అందించేందుకుగాను గోదావరి బేసిన్ డిప్యూటీ సీఈ అజ్మల్ ఖాన్‌కు బాధ్యతలు అప్పగించారు. ప్రతి సోమవారం, గురువారం డిటెయిల్డ్ రిపోర్టును సమర్పించడంలో ఆయన సహకరించనున్నారు. రిటైర్డ్ ఈఈ యాదగిరిని కన్సల్టెంట్‌గా నియమించిన ప్రభుత్వం.. రిపోర్టుల తయారీకి సహకరించాలని ఆదేశించింది.
మరోవైపు మే చివరి నాటికల్లా టెస్టులన్నీ పూర్తి చేయాలని, ఆ పనుల పురోగతిపై ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు ఇరిగేషన్సెక్రటరీకి రిపోర్ట్ సమర్పించాలని, ప్రతి సోమవారం, గురువారం సమగ్ర రిపోర్టులను అందజేయాలని స్పష్టంచేసింది. కాగా, టెస్టులకు అవసరమనుకుంటే జాతీయ స్థాయిలోని టెక్నికల్ స్పెషలిస్టులనూ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది.
డిజైన్లకు ముందు టెస్టులు
బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి డిజైన్లు తయారు చేయడానికి ముందే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని సర్కారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అందుకు తగ్గట్టుగానే కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇటు సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) లాంటి అత్యున్నత సంస్థలనూ రంగంలోకి దింపింది. సీడబ్ల్యూపీఆర్ఎస్ నేతృత్వంలో బ్యారేజీలకు 3 దశల్లో టెస్టులను నిర్వహిస్తారు.
గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) స్కానింగ్, డ్రోన్ సర్వేలు, బోర్‌హోల్ ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. ఆ తర్వాత జియోటెక్నికల్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్నిర్వహించనున్నారు. బ్యారేజీల ఫౌండేషన్లతో పాటు అక్కడి నేల పటిష్టత, నిర్మాణ సామర్థ్యాలనూ టెస్టుల ద్వారా విశ్లేషించనున్నారు.
మరోవైపు, బ్యారేజీల టెస్టులకు సంబంధించి ఏ చిన్న లోపం కూడా తలెత్తకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యారేజీల ఫౌండేషన్లు, కటాఫ్ వాల్స్ పటిష్టతను తెలుసుకునేందుకు అన్ని యాంగిల్స్‌లోనూ అధికారులు విశ్లేషణ చేయనునున్నారు.
టెస్టులు పూర్తయ్యాక నిర్మాణాల్లో ఇప్పటికే ఉన్న లోపాల తీవ్రతతో పాటు కొత్త లోపాలు ఏమైనా ఉన్నాయా? అన్నది తేల్చనున్నారు. వాటికి తగ్గట్టుగా కొత్త డిజైన్లను ఇవ్వనున్నారు. ఆ డిజైన్లను రివ్యూ చేసేందుకు ఎన్డీఎస్‌ఏకు పంపించనున్నారు. ఎన్డీఎస్‌ఏ ఓకే చెప్పాక.. ప్రభుత్వం పునరుద్ధరణ పనులను చేపట్టనుంది.
బ్యారేజీలకు శాస్త్రీయంగా రిపేర్లు: మంత్రి ఉత్తమ్
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కాళేశ్వరం బ్యారేజీలకు తీవ్ర నష్టం జరిగిందని, వాటికి శాస్త్రీయంగా రిపేర్లు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్డీఎస్‌ఏ, సీడబ్ల్యూపీఆర్‌ఎస్ అధికారులతో నిత్యం
కో ఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు.
ఐఐటీ ముంబైకి చెందిన నిపుణుల సాయం కూడా తీసుకుంటున్నామని చెప్పారు. మే చివరి నాటికి ఇన్వెస్టిగేషన్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వర్షాకాలం తర్వాత రిపేర్లు ప్రారంభిస్తామని తెలిపారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి పనులను పర్యవేక్షించనున్నారు.

