రాష్ట్రంలో వోల్వో బస్సుల్లో కరోనా టెస్టులు

రాష్ట్రంలో వోల్వో బస్సుల్లో కరోనా టెస్టులు

శాంపిల్స్ సేకరణకు అందుబాటులోకి తెచ్చిన సర్కార్
కంటైన్మెంట్ జోన్లలో నేరుగా టెస్టులు చేసేందుకు చాన్స్
బస్సులను ప్రారంభించిన మంత్రి ఈటల రాజేందర్

హైదరాబాద్, వెలుగు: మొబైల్ కరోనా టెస్టింగ్ ల్యాబ్స్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడికక్కడ శాంపిల్స్ సేకరించడానికి వీలుగా అత్యాధునిక సదుపాయాలు కలిగిన 20 వోల్వో బస్సులను ప్రారంభించింది. ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్లను హాస్పిటల్ కు తరలించేందుకు వీలుగా ఈ బస్సులకు అనుబంధంగా వెంటిలేటర్తో కూడిన 20 అంబులెన్స్లు కూడా సిద్ధం చేసింది. ఇంటెలిజెన్స్ మానిటరింగ్ ఎనాలసిస్ సర్వీస్ క్వారెంటైన్(iMASQ) టెక్నాలజీతో వెరా స్మార్ట్ హెల్త్ సంస్థ తయారుచేసిన ఈ బస్సులను బుధవారం కోఠిలోని కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. వైద్య శాఖకు 20 వోల్వో బస్సులు, 20 అంబులెన్స్ లు అందించేందుకు ముందుకొచ్చిన వెరా స్మార్ట్ హెల్త్ సంస్థ సీఈవో ధర్మతేజ, సీవోవో విజయలను మంత్రి ఈటల అభినందించారు.

ఒక్కో బస్లో 4 బెడ్స్, 10 కలెక్షన్ కౌంటర్లు
మొబైల్ టెస్టులు, శాంపిల్స్ కలెక్షన్ కోసం వెరా సంస్థ ఈ 20 వోల్వో బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో బస్సులో 10 శాంపిల్ కలెక్షన్ కౌంటర్లు ఉంటాయి. పదిమంది టెక్నీషియన్స్ బస్సు లోపలే ఉండి బయట ఉన్న వ్యక్తుల నుంచి నమూనాలు సేకరిస్తారు. ఈ వోల్వో బస్సుల్లో
వెంటిలేటర్ సదుపాయం గల చిన్నపాటి ICU  ఉంటుంది. వీటితోపాటు ఆక్సిజన్ సదుపాయం గల నాలుగు బెడ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కంటైన్ మెంట్ జోన్లు, పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ బస్సు నుంచే అనుమానితులందరికీ వెంటవెంటనే పరీక్షలు చేయడానికి అవకాశం ఉంటుందని వెరా సంస్థ ప్రతినిధులు చెప్పారు. వీటి ద్వారా సుదూర ప్రాంతాల నుంచి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లను పెద్దాసుపత్రులకు తీసుకురావొచ్చన్నారు. కాగా, ఈ బస్సు ద్వారా ఆర్ టీపీసీఆర్ టెస్ట్ చేయడానికి వైద్య శాఖ ప్రణాళికలు సిద్ధం
చేసింది.

వెంటిలేటర్ ఉన్న 20 అంబులెన్స్లు కూడా..
మరోవైపు 20 వోల్వో బస్సులకు అనుసంధానంగా 20 అంబులెన్సులు కూడా అందుబాటులో ఉంటాయి. అత్యవసర పరిస్థితి ఉన్న పేషెంట్లను ఆక్సిజన్ సదుపాయం ఉన్న ఈ అంబులెన్స్ల్ లో దగ్గరలోని ఆస్పత్రికి తరలించవచ్చు. ఏ హాస్పిటల్ లో ఎన్నిబెడ్లు ఖాళీగా ఉన్నాయని తెలుసుకునే టెక్నాలజీ కూడా ఉండటం వల్ల, బెడ్స్ అందుబాటులో ఉన్న హాస్పిటల్ కు పేషెంట్లను తీసుకువెళ్లడం ద్వారా వారి ప్రాణాలు కాపాడవచ్చని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

15 వేల టెస్టులు చేస్తున్నాం..
ప్రతి రోజు 15 నుంచి 16 వేల టెస్టులు చేస్తున్నామని, ఈ బస్సుల ద్వారా టెస్టుల సంఖ్య మరింత పెరగనుందని ఈటల చెప్పారు . 80% మందికి పాజిటివ్ ఉన్నా ఎలాంటి లక్షణాలు ఉండటం లేదని, వారంతా హోం క్వారంటైన్లోనే ఉండొచ్చని అన్నారు. వీరి నిరంతర పర్యవేక్షణకు ‘హితం’ అనే యాప్ ను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. 15% మందికే ట్రీట్ మెంట్ అవసరం ఉంటుందన్నారు . 5% మందికే ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరం వస్తోందని చెప్పారు. ప్రస్తుతం 1,100 స్వాబ్ కలెక్షన్ సెంటర్స్ లో టెస్టులు చేస్తున్నామని, కంటైన్మెంట్ జోన్స్ కు నేరుగా వెళ్లి త్వరితగతిన టెస్టులు చేయడానికి ఈ బస్సులు ఉపయోగపడతాయన్నారు.

For More News..

అన్నా.. రాఖీ పంపుతున్నా.. నేను రావట్లే..

వార్డెన్ నిర్లక్ష్యంతో 14 మంది అంధులకు కరోనా

సెక్రటేరియట్‌ ‌డిజైన్‌లో మార్పులు