రోజు రోజుకు పరిస్థితి తీవ్రమవుతోంది: డబ్ల్యూహెచ్‌వో

రోజు రోజుకు పరిస్థితి తీవ్రమవుతోంది: డబ్ల్యూహెచ్‌వో
  • విజృంభిస్తున్న కరోనా మహమ్మారి
  • ఆదివారం నమోదైన కేసులు అత్యధికంగా 10 దేశాల్లోనే

జెనీవా: కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి తీవ్రం అవుతోందని వరల్డ్‌ హెల్త్ ఆర్గనైజేషన్‌ హచ్చరించింది. యూరప్‌ దేశాల్లో కాస్త తగ్గుముఖం పట్టినా అమెరికా ఖండాలు సహా దక్షిణాసియా దేశాల్లో కేసులు సంఖ్య పెరిగిపోతుందని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం అత్యధికంగా కేసులు నమోదయ్యాయని, అవి కూడా 10 దేశాల నుంచే ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. గడిచిన 9 రోజుల్లో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని, ఆదివారం ఒక్కరోజు 1,36,000 పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు చెప్పారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా కొన్ని వర్గాలు చేస్తున్న ఆందోళనలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనల్లో పాల్గొనే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ టైంలో ఆందోళనలు చేయడం అంటే నిబంధనలను అతిక్రమించినట్లే అని ఆయన చెప్పారు. దీని వల్ల మరోసారి కరోనా విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించారు. జాతి సమానత్వం కోసం చేసే పోరాటానికి డబ్ల్యూహెచ్‌వో ఎప్పుడు మద్దతు పలుకుతుందని, కానీ నిబంధనలు పాటిస్తూ నిరసన తెలియజేయాలని అన్నారు. వీలైనంత వరకు పక్కవారి నుంచి కనీసం ఒక మీటరు దూరం పాటించాలని, చేతులను శుభ్రం చేసుకుంటూ.. దగ్గు వస్తే కవర్‌‌ చేసుకోవాలని సూచించారు. కచ్చితంగా మాస్కు ధరించి నిరసనల్లో పాల్గొనాలని చెప్పారు. ఆరోగ్యం సరిగా లేకపోతే ఇంట్లోనే ఉండాలని అన్నారు. ఆఫ్రీకా దేశాల్లో వైరస్‌ రోజు రోజుకి పెరుగుతోందని టెడ్రోస్‌ చెప్పారు. చాలా దేశాల్లో కేసులు వెయ్యికి తక్కువగానే ఉన్నప్పటికీ రోజు రోజుకి కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందని, కానీ కొన్ని దేశాల్లో ప్రభావం తక్కువగా ఉండటం కొంత మేర ఊరట కలిగిస్తుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంతా కరోనాతో ఇప్పటి వరకు 71,93,476 మంది ఈ వ్యాధి బారన పడగా.. వారిలో 4,08,614 మంది చనిపోయారు.