అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని సరిగ్గా అర్థం చేసుకోండి

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని  సరిగ్గా అర్థం చేసుకోండి

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న రకరకాల వ్యాఖ్యానాలు చూస్తుంటే ఆయన మాటల్లో పరిపక్వత గోచరించకపోగా, అవి కేవలం తమ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని కాపాడేందుకు సర్ది చెబుతున్నట్లుగా ఉన్నాయి. ఓటమికి కారణంగా ఓసారి సోషల్ మీడియా ప్రచారంలో వెనుకబడటమే అన్నారు. మరోసారి సగం అభ్యర్థులను మార్చితే గెలిచేవారమని అన్నారు. ఎవరిని మార్చి ఉంటే బాగుండేదో వారి పేర్లు ఇప్పటికైనా బయటపెట్టాలి మరి. అబద్ధం ముందు అభివృద్ధి ఓడింది అని ఓసారి అన్నారు. నిజానికి అభివృద్ధి తక్కువ, అబద్ధాలు ఎక్కువ అవడం వల్లనే బీఆర్ ఎస్ ఓడింది. ఈ మధ్య జరిగిన  భువనగిరి లోక్ సభ సన్నాహక సమావేశంలో ఓటమికి పూర్తి బాధ్యత తనదే అంటూ పలు అంశాలను అందుకు కారణంగా ఎత్తి చూపారు.   పరిపాలనలో నిమగ్నమై పార్టీని పట్టించుకోలేదని ఒక మాట అన్నారు. హామీల కప్పదాట్లు,  కార్యనిర్వహణలో వైఫల్యాలు తప్ప పరిపాలనలో పటిష్టత ఏమీ లేదు.

‘బంధులే’ ఓడించాయి అంటున్నారు!

పార్టీని పట్టించుకోలేదు అంటే పార్టీలో ఉన్నవాళ్లు మాత్రం పదవులను, గులాబీ కండువాను వాడుకొని హాయిగానే ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితి ముందు కన్నా ఎన్నో రెట్లు మెరుగుపడింది. ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లకు సరైన గుర్తింపు ఇవ్వలేదంటే, నిజానికి కిక్కిరిసిపోయిన ఆ పార్టీలోకి వచ్చేవాళ్లకు కండువాలు కప్పవలసిన అవసరమే లేదు. కేవలం ఆ 'ఇతర' పార్టీలను బలహీనం చేయడానికే ఈ చేర్పులు జరిగాయి. ఓటమికి ఇదో అంశమా అనిపిస్తుంది. ఓటరుకు లభించే పథకాల విషయంలో కార్యకర్తల ప్రమేయం లేకపోవడంతో నష్టం జరిగిందని కొందరన్నారు. ఒక పాత్రికేయ సమావేశంలో 'దళితబంధు'లో లక్షలు కమీషన్లు అడుగుతున్న ఎమ్మెల్యేల లిస్టు తన దగ్గర ఉందని స్వయానా కేసీఆర్ అన్నారు. ప్రమేయమంటే ఏందో ఎమ్మెల్యేలే దళిత బంధు విషయంలో నిరూపించారు. దళితబంధు కొందరికే ఇవ్వడం ఓ మైనస్ పాయింట్ అనుకుంటే, దాని నిబంధనలే ఆ కీడు తెచ్చాయనవచ్చు.  రైతుబంధు పెద్ద భూస్వాములకీయడం, చిన్న రైతుకు నచ్చలేదు అనేది ఒక కారణంగా చెప్పారు. రైతుబంధు విషయంలో ఎందరో విషయ నిపుణులు సూచనలిచ్చారు. వాటిని పెడ చెవిన పెట్టి కౌలు రైతును అరిగోస పెట్టారు. వందెకరాల భూస్వామికిచ్చే డబ్బు ఇరవై మంది కౌలు రైతుల అవసరాలు తీర్చేది. ఎవరి మాటైనా వింటే ఓటమికి ముందే అన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉండేది. 

రెండూ ఒకటే!

కాంగ్రెస్ గెలవకుండా మీకు రూటు క్లియర్ చేసే ప్రయత్నంలోనే బీజేపీ వెనక్కి తగ్గిందని అందరికీతెలుసు. బీజేపీతో లోలోపల ఒప్పందాలు లేవంటే నమ్మేదెలా! రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు సీట్లు వస్తే, వాటితో బీజేపీ అవసరాలు తీర్చరనే హామీ ఎన్నికల ప్రచారంలో చెప్పగలరా! పైకి ఎలా మాట్లాడినా భావజాలపరంగా బీఆర్​ఎస్, బీజేపీ రెండూ ఒకటే. యాదాద్రి, యాగాలు, స్వాముల పాదపూజ అన్నీ సేమ్ టు సేమ్.  

కల్లబొల్లి మాటలు, కుటుంబ పాలన కొంప ముంచాయి

ఇక అసలు విషయానికొస్తే బీఆర్ఎస్ ఓటమికి మొదటి కారణం కేసీఆర్ కల్లబొల్లి మాటలు. రెండోది కుటుంబ పాలన. ఏదో కథలు చెప్పి తెలంగాణ ప్రజలను ఏలవచ్చని కేసీఆర్ గట్టిగా నమ్మారు. సంక్షేమ పథకాలను వెదజల్లితే పావురాల్లా వచ్చి చిక్కుతారనే ఆయన అతి విశ్వాసం దెబ్బ తీసింది. దళితున్ని తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి చేస్తానని ఆడి తప్పిన మాట అవకాశం చూసి ఆయన్ని పామై కాటేసింది. ఆయన హామీలుగా ఎన్ని మాటలు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు చెప్పాడో ఆయనకే గుర్తుండకపోవచ్చు. చివరకు ఆయన ఎంత భరోసాగా మాట్లాడినా అయ్యేదాకా నమ్మకం లేదనే భావన ప్రజల్లో ఏర్పడిపోయింది. అవే హామీలు అగ్రకులాల విషయంలో వెంటనే నెరవేరే పరిస్థితి ఉండేది. ప్రతి పాత్రికేయ సమావేశంలో విలేకరులకు ఇండ్ల స్థలాల ముచ్చట ఒక జోక్​గా మారిపోయింది. రైతు బంధు, దళిత బంధులను సంస్కరిస్తే పంట రుణాలు మాఫీ, నిరుద్యోగ భృతికి కొంత వెసులుబాటు ఉండేది. మేడిగడ్డ కుంగుబాటుకు నిజాయతీగా బాధ్యత వహించవలసింది. తమ మాట కేసీఆర్ పట్టించుకొనేవారు కాదని ఇంజినీర్లు ఇపుడు అంటున్నారు. కాళేశ్వరం బీఆర్ఎస్​కు ఏటీఎంగా మారిందనడానికి బలం చేకూరింది.

-  బి. నర్సన్, సోషల్​​ ఎనలిస్ట్