కౌన్సెలింగ్: మిల్లెట్స్ తింటున్నారా?

కౌన్సెలింగ్: మిల్లెట్స్ తింటున్నారా?

ఒకప్పుడు బియ్యంతోపాటు జొన్నలు, రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలు (మిల్లెట్స్) కచ్చితంగా తినేవాళ్లు. దానికి తగ్గ కష్టం చేసేవాళ్లు. బలంగా, ఆరోగ్యంగా ఉండేవాళ్లు. పాలిష్​ చేసిన బియ్యం తినడానికి ఎప్పుడైతే అలవాటు పడ్డారో.. అప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు మొదలు. అప్పుడప్పుడైనా మిల్లెట్స్ తినమంటే.. కడుపు నొప్పి, వేడి, అరగదు.. అని కంప్లైంట్​లు. మరి శరీరానికి పోషకాలు అందేదెలా?మిల్లెట్స్ తిన్నా సమస్యలు రాకూడదంటే ఏం చేయాలి? అనే ప్రశ్నలకు న్యూట్రిషనిస్ట్​  డా. సుజాత స్టీఫెన్ ఇలా చెప్ప్తున్నారు...

లైఫ్ స్టైల్​ మారుతున్న కొద్దీ, తినే తిండి కూడా మారుతోంది. తరాలు మారేకొద్దీ, మిల్లెట్స్ తినడం మర్చిపోయారు. కొట్లో కొనుక్కొచ్చిన బియ్యం అయితే ఒంటికి పడతాయి. మిల్లెట్స్ తింటే పడట్లేదని కంప్లైంట్ చేస్తున్నారు. కానీ, కేవలం అన్నం, చపాతీలు తింటే సరిపోదు. వాటిలో ఉండే పోషకాలు శరీరానికి సరిపోవు. కాబట్టి, జొన్న, సజ్జ, కొర్ర, సామ, అరిక, రాగులు వంటివి తినాలి. చాలామందికి అవి తినాలని ఉన్నా వేడిచేస్తుందని, అరగదని, కడుపు నొప్పి అని... ఇలా రకరకాల సమస్యలు చెప్తుంటారు. 

అయితే అన్నం తినడం వల్ల బరువు పెరుగుతున్నారని, పోషకాలు సరిపోవట్లేదని మిల్లెట్స్ అలవాటు చేసుకుంటున్నారు కొందరు. ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఆలోచించుకుని తినేస్తున్నారు తప్ప ఎంత తినాలి? ఎలా తినాలి? అనే అవగాహన ఉండట్లేదు. ‘ఫలానావి తింటే మంచిదట..’ అని ఎవరైనా చెప్తే అవి తినడం మొదలుపెడుతున్నారు. కొందరైతే మూడుపూటలా వాటినే తినాలనుకుంటున్నారు. అయితే, అసలు తినక పోవడం ఎంత తప్పో, విపరీతంగా తినడమూ అంతే తప్పు!

అలా కాదు.. ఇలా తినాలి

గత రెండేండ్లుగా చూసుకుంటే న్యూట్రియెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది మిల్లెట్స్ తినడానికి ఇష్టపడుతున్నారు. వీటిలో ప్రొటీన్ ఎక్కువ, కార్బోహైడ్రేట్లు తక్కువ ఉంటాయి. అందువల్ల వెయిట్ లాస్ అయ్యేందుకు వాళ్లు కొలెస్ట్రాల్​ కంట్రోల్ చేసేందుకు తింటారు. మిల్లెట్స్​ని రెగ్యులర్​గా తినాలకుంటే తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. అన్నం తిన్నట్టు తినకూడదన్నమాట. అప్పుడు లైఫ్​లాంగ్ కంటిన్యూ చేయొచ్చు. అలాగే మిల్లెట్స్​ని మూడు పూటలా తినకూడదు. 

ఏదో ఒక పూట.. అది కూడా శ్నాక్​ రూపంలో తినాలి. ఎందుకంటే మిల్లెట్స్​లో ఫైబర్, ప్రొటీన్, ఐరన్, జింక్, కాల్షియం, పొటాషియం వంటి మైక్రో న్యూట్రియెంట్స్ ఎక్కువ. శరీరానికి మైక్రో న్యూట్రియెంట్స్ తక్కువ అవసరం అవుతాయి. అందుకని శ్నాక్​ రూపంలో తీసుకుంటే చాలు. లేదంటే రాత్రిపూట తక్కువ తినాలి కాబట్టి అప్పుడు తినొచ్చు. వేరే ఏదైనా ఐటమ్​లో వీటిని కలిపి తీసుకున్నా మేలే. వానాకాలంలో సీజన్​లో మిల్లెట్స్ తినడం మంచిది. మిల్లెట్స్​లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో క్వినోవా తింటే చాలా మంచిది.  

సమస్యలున్న వాళ్లకే..

చాలామందికి అరుగుదల బాగానే ఉంటుంది. అయితే, మిల్లెట్స్ విషయంలో వాటిని వండే ప్రాసెస్​ ఇంపార్టెంట్. వాటిని శుభ్రంగా కడిగి, బాగా నానబెట్టాలి. ఆ తర్వాత పూర్తిగా ఉడికేంతవరకు వండాలి. లేదంటే ఉబ్బరం, కడుపు నొప్పి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. మిల్లెట్స్ శరీరంలో వేడిని పుట్టిస్తాయి. అయితే, చాలామంది వేడి చేస్తుందని వాటిని తినడం మానేస్తున్నారు. మిల్లెట్స్ అరగకపోవడానికి కారణం కూడా ఫైబర్​ ఎక్కువ ఉండడమే. అందుకే మితంగా తింటే ఏ ప్రాబ్లమ్​ ఉండదు. అందుకే వెయిట్ లాస్​కి, డయాబెటిక్ కంట్రోల్​కి, చర్మ వ్యాధులు నయం కావడానికి, మెనుస్ట్రువల్ పెయిన్ తగ్గడానికి మిల్లెట్స్ తినమంటారు. 

మిల్లెట్ అలర్జీ అనే సమస్య కూడా ఉంటుంది. దీనిగురించి చాలామందికి తెలియదు. మిల్లెట్స్ తింటే పడట్లేదు అంటుంటారు. తిన్నప్పుడల్లా వాళ్లలో కంటిన్యూగా దగ్గు రావడం, అరగకపోవడం వంటి సమ్యసలు కనిపిస్తాయి. అలాంటి వాళ్లు మిల్లెట్స్​ తినడం తగ్గిస్తే మంచిది. అలాగే, హైపోథైరాయిడిజమ్ ఉన్నవాళ్లు మిల్లెట్స్ తినడం చాలావరకు తగ్గించాలి. ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి పనితీరును దెబ్బతీస్తుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్లలో క్రియాటిన్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. 

వాళ్లు కూడా మిల్లెట్స్ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే గ్యాస్ ప్రాబ్లమ్​ ఉన్నవాళ్లు కూడా ఎక్కువగా తింటే ఇబ్బంది పడతారు. ఇలా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లలోనే మిల్లెట్స్ తిన్నప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి, అలాంటి వాళ్లు నెలకి మూడు లేదా నాలుగు సార్లు తింటే ఏం కాదు. రెగ్యులర్​గా తింటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. 

పిల్లలకు

పిల్లలకు అన్ని పోషకాలు అందాలంటే అన్నంతోపాటు మిల్లెట్స్ తినడం కూడా అలవాటు చేయాలి. పిల్లల డైజెస్టివ్​ సిస్టమ్​ హెల్దీగా ఉంటుంది. అందువల్ల వాళ్లకు ఏం పెట్టినా అరిగించుకోగలరు. పిల్లలకు మిల్లెట్స్ పెట్టాలంటే ఆలోచిస్తుంటారు కొందరు. ఆ విషయంలో  అనుమానమే అక్కర్లేదు. కొంచెం కొంచెంగా అలవాటు చేయాలి. పిల్లల బాడీకి అలవాటైతే, ఏ ప్రాబ్లమ్ రాదు. వాళ్లే ఇష్టంగా తింటారు. ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు మిల్లెట్స్ మాత్రమే తింటున్నారు. కానీ, అలా తినడం కూడా మంచిది కాదు. మిల్లెట్స్​తో పాటు అన్నీ తినాలి. 

- డాక్టర్ సుజాత స్టీఫెన్, ఆర్ డి చీఫ్ న్యూట్రిషనిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్