అయోధ్య రామాలయ భూమి పూజపై పిల్‌ కొట్టివేత

అయోధ్య రామాలయ భూమి పూజపై పిల్‌ కొట్టివేత

ప్రయాగ్‌రాజ్: అయోధ్యలో నిర్మించనున్న రామ మందిరం భూమి పూజ కార్యక్రమంపై వేసిన పిల్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టి వేసింది. ఆగస్టు 5న జరగనున్న భూమి పూజకు రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంపై ముంబైకి చెందిన సాకేత్ గోఖలే అనే సోషల్ యాక్టివిస్ట్‌ ఈ పిల్‌ వేశారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో అయోధ్యలోని రామ మందిర భూమి పూజ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రోటోకాల్స్‌ను అతిక్రమిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ ప్రకారం.. భూమి పూజ కార్యక్రమానికి రావాల్సిందిగా 300 మందికి ఆహ్వానాలు పంపించారు. తద్వారా సోషల్ డిస్టెన్సింగ్‌ను పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనను యూపీ సర్కార్ ఉల్లంఘిస్తోందని పిల్‌లో పేర్కొన్నారు.

పిటిషనర్ వాదనలను బెంచ్ కొట్టి వేసింది. రిట్‌ ఊహాగానాల ఆధారంగా ఉందని, ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారనడానికి ఎలాంటి రుజువూ లేదని కోర్టు వెల్లడించింది. ప్రస్తుతానికి ఆర్గనైజర్స్‌తోపాటు ఉత్తర్‌‌ ప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రోటోకాల్స్‌, సోషల్, ఫిజికల్ డిస్టెన్సింగ్‌ను పాటిస్తుందని తాము ఆశిస్తున్నట్లు వివరించింది. ఈ వ్యవహారంలో కలగజేసుకోవడానికి తమకు ఎలాంటి నిర్దిష్ట కారణమూ కనిపించడం లేదని స్పష్టం చేసింది.