
హైదరాబాద్: పహల్గాం టెర్రర్ ఎటాక్‌కు కౌంటర్‌గా ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దాయాది పాక్, భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషషయం తెలిసిందే. కేంద్ర ఆదేశాల మేరకు హైదరాబాద్ లో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ చేపడుతున్నట్లు సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మాక్ డ్రిల్ రద్దు అంటూ వస్తోన్న వదంతులను నమ్మొద్దని సూచించారు. అత్యసవర సమయాల్లో ఎలా స్పందించాలో ప్రజలకు అవగాహన కల్పించడానికే ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ డ్రిల్ లో భాగంగా వైమానిక దాడులు జరిగినప్పుడు ఎలా రియాక్ట్ కావాలో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత వార్ సైరన్ మోగబోతుందని.. సైరన్ మోగినప్పుడు ఎలా వ్యవహరించాలో ప్రజలకు చెప్తామన్నారు. హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి జంక్షన్ లో రెండు నిమిషాల పాటు సైరన్ మోగుతుందని తెలిపారు. వార్ సైరన్ మోగగానే ప్రజలు అలర్ట్‌గా ఉండాలని.. ఇళ్లలో ఉన్నవారు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు.
►ALSO READ | రాష్ట్రపతితో ప్రధానిమోదీ భేటీ..‘‘ఆపరేషన్ సిందూర్’’పై వివరణ
బయట ఉండే ప్రజలు, వాహనదారులు సైరన్ మోగగానే సురక్షిత ప్రాంతాలకు, సమీప భవనాల్లోకి వెళ్లాలని చెప్పారు. సరిగ్గా 4 గంటలకు 2 నిమిషాల పాటు సైరన్ మోగుతుంది. 15 నిమిషాల తర్వాత మరో అలర్ట్ వస్తోందని తెలిపారు. 15 నిమిషాల పాటు 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామన్నారు. గోల్కొండ, కంచన్ బాగ్, సికింద్రాబాద్, ఎన్ఎఫ్సీలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.