గోరక్షకులు.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు: సీపీ వీసీ సజ్జనార్

గోరక్షకులు.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు: సీపీ వీసీ సజ్జనార్

బషీర్​బాగ్, వెలుగు: రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదివారం గోరక్షక సంఘాల ప్రతినిధులతో బంజారాహిల్స్​లోని టీజీఐసీసీసీలో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. పండుగ సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిషనరేట్ సరిహద్దుల్లో చెక్​పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, పశు అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులపై దాడులు చేసి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని స్పష్టం చేశారు. 

సమన్వయం కోసం ప్రతి సంఘం ఒక ప్రతినిధిని, సభ్యుల ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్లను పోలీసులకు అందజేయాలని, వాలంటీర్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశించారు. వాలంటీర్లు చెక్​పోస్టుల వద్ద పోలీసులతో కలిసి వెళ్లకూడదని, పశువుల ఫొటోలు తీయడం లేదా నిందితుల వివరాలను సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో షేర్‌‌‌‌‌‌‌‌ చేయడం వంటి పనులు చేయరాదని సూచించారు. ఉద్రిక్తతలు పెంచేలా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలు లేదా రీల్స్ పోస్ట్ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 

తనిఖీల పేరుతో గోరక్షకులు ఆయుధాలు ధరించినా లేదా పోలీసు విధులకు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పండుగ సమయాల్లోనే కాకుండా ఏడాది పొడవునా పశువైద్యుల ధ్రువీకరణ లేకుండా జరిగే అక్రమ రవాణాపై నిఘా ఉంచుతామని, అక్రమ రవాణాపై సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ నంబరు 8712661000ను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, వివిధ గోరక్షక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.