హైదరాబాద్, వెలుగు: పేపర్ లీకేజీలపై ఢిల్లీలో చేపట్టిన నిరసన సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో పాటు పలువురు ఎంపీలను అరెస్టు చేయడాన్ని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు.
చలో పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, యువతపై బాష్పవాయువు ప్రయోగించి లాఠీఛార్జి చేయడం అమానుషమన్నారు. దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీలపై పార్లమెంట్‌లో చర్చించాలని ప్రతిపక్షాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. యువతపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లాఠీఛార్జికి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లడఖ్ హక్కుల కోసం నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌తో కేంద్రం వెంటనే చర్చలు జరిపి ఆయన ప్రాణాలను కాపాడాలని కోరారు. హైదరాబాద్‌లోని లోక్ భవన్ వద్ద నిరసన తెలిపిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టును కూడా ఆయన ఖండించారు.
