రామోజీఫిల్మ్ సిటీ గేటు వద్ద సీపీఎం ఆందోళన

రామోజీఫిల్మ్ సిటీ గేటు వద్ద సీపీఎం ఆందోళన

ఎల్బీ నగర్, వెలుగు: పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూమిని రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కబ్జా చేశారని సీపీఎం నేతలు ఆరోపించారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఆ ఇండ్ల పట్టాలకు సంబంధించిన భూమిని పేదలకే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సీపీఎం ఇబ్రహీంపట్నం నాయకుల ఆధ్వర్యంలో బుధవారం నాగాన్ పల్లిలోని రామోజీ ఫిల్మ్ సిటీ వెనుక గేటు వద్దకు ర్యాలీగా వచ్చి ఆందోళన చేశారు. పేదలకు ఆ భూములు చూపించాలని ఇండ్ల పట్టాదారులు, సీపీఎం నాయకులు ధర్నా చేశారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జాన్ వెస్లీ మాట్లాడుతూ, 2007లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగాన్ పల్లి రెవెన్యూ గ్రామంలో 18 ఎకరాల్లో 700 మందికి 60 గజాల చొప్పున అప్పటి ఉమ్మడి ఏపీ  సీఎం రాజశేఖర్ రెడ్డి పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చారన్నారు. ప్రస్తుతం ఆ  భూములకు రామోజీరావు గేట్లు పెట్టి పేదలను లోపలకు రానివ్వడం లేదన్నారు. ఆ భూములను ఫిల్మ్ సిటీకి ఇవ్వాలని ప్రభుత్వానికి అర్జీపెట్టుకున్నారని తెలిపారు. 2017లో 295 ఎకరాలను ఫిల్మ్ సిటీకి కేటాయించేందుకు టీఆర్ఎస్ సర్కారు సిద్ధమైందని, దీంతో ఇండ్ల పట్టాలు పొందిన పేద కుటుంబాల జనం ఆగమయ్యారని చెప్పారు.