తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయండి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయండి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల ప్రారంభం సందర్భంగా గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోయర్ ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆయన పార్టీ ముఖ్య నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడారు.

నైజాం నిరంకుశ పాలనలో పాలకుర్తి ప్రాంతంలో భూస్వామి విసునూరి రామచంద్రారెడ్డి అక్రమాలను, దౌర్జన్యాలను కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో వీరనారి ఐలమ్మ ధైర్యంగా ఎదుర్కొన్నారని కొనియాడారు. ఆమె తెగువ స్ఫూర్తితోనే తెలంగాణవ్యాప్తంగా ‘భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం’ చారిత్రాత్మక సాయుధ రైతాంగ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడిందన్నారు. పీడిత, శ్రామిక వర్గాల విముక్తి కోసం సాగిన ఈ మహత్తర పోరాటంలో సుమారు 3 వేల గ్రామాల్లో ప్రజారాజ్యాలు ఏర్పాటయ్యాయని, వెట్టిచాకిరీ రద్దయిందని గుర్తుచేశారు. ఐలమ్మను స్మరించుకోవడమంటే పీడిత ప్రజల విముక్తి పోరాటాన్ని గౌరవించుకోవడమేనన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి, రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, ఎం. వెంకటేష్ పాల్గొన్నారు.