
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పోడు సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. చాలాకాలంగా ఈ సమస్యను పెండింగ్లో పెట్టడంతో, పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ రావు హత్యకు గురి కావడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాలతో గిరిజనులపై అటవీ సిబ్బంది దాడులు కామన్ అయిపోయాయన్నారు. అనేక మంది గిరిజన రైతుల ఆత్మహత్యలతో పాటు అటవీ అధికారులపైనా దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. శ్రీనివాస్ రావు హత్యను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఖండించారు.