- ఉద్యోగులకు సీపీఎస్ఈయూ పిలుపు
హైదరాబాద్, వెలుగు: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 17న సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులంతా సామూహిక సెలవు పాటించాలని కంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు. ఓపీఎస్ ఉద్యోగులతో పాటు రాష్ట్రంలోని రెండు ఉద్యోగ జేఏసీలు తమ ఆందోళనకు మద్దతు తెలుపాలని కోరారు. సీపీఎస్ రద్దు కోరుతూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీల్లో ఉద్యోగులు, టీచర్లు నల్లబ్యాడ్జీలను ధరించి పెన్షన్ విద్రోహ దినం పాటించారు.
ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. సెప్టెంబర్ ఒకటో తేదీ, 2004న జారీ చేసిన జీవోల ద్వారా పాత పింఛన్ రద్దు చేసి, సీపీఎస్ అమల్లోకి తెచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టోలో ఓపీఎస్ హామీని ప్రకటించిన నవంబర్ 17న సామూహిక సెలవుకు ఎంచుకున్నట్లు తెలిపారు. ఆనాడు ఇచ్చిన మాటను ప్రభుత్వానికి గుర్తుచేయడమే తమ ఆందోళన ముఖ్య ఉద్దేశమన్నారు.
సీపీఎస్ రద్దుతో ఎన్‌పీఎస్ ట్రస్ట్‌లో జమైన దాదాపు రూ. 19 వేల కోట్ల నిధి రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి వస్తుందని, దీన్ని సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం కాదని స్పష్టం చేశారు. రాజస్తాన్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల తరహాలోనే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, దక్షిణాదిలో సీపీఎస్‌ను రద్దు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని స్థితప్రజ్ఞ విజ్ఞప్తి చేశారు.
ఇంటర్ బోర్డులో నల్లబ్యాడ్జీలతో నిరసన..
పెన్షన్ విద్రోహదినం సందర్భంగా మంగళవారం ఇంటర్ బోర్డులో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జగదీశ్ రెడ్డి, సుబ్రమణ్యం నేతృత్వంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ అమలు చేయాలని కోరారు.
