రాష్ట్ర సర్కారు ఆయుష్మాన్ డ్రామా

రాష్ట్ర సర్కారు ఆయుష్మాన్ డ్రామా
  • స్కీమ్‌ అమలు చేయకున్నా చేస్తున్నట్లుగా మాయ మాటలు
  • 1.19 లక్షల మందికి ట్రీట్‌మెంట్ చేసినట్లు రికార్డులు
  • రూ.259 కోట్లు ఖర్చు చేసినట్లు అసెంబ్లీలో ప్రకటనలు
  • ఇప్పటిదాకా కనీసం గైడ్‌లైన్స్ కూడా రిలీజ్ చేయలే
  • లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులు ఇవ్వలే
  • ప్రైవేట్​ హాస్పిటళ్లకు వెళ్లి లక్షల్లో బిల్లులు కడుతున్న జనం
  • స్కీమ్‌ గురించి తమకేమీ సమాచారం లేదంటున్న ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌

హైదరాబాద్, వెలుగు: పేదలకు ఉచిత ట్రీట్‌‌మెంట్‌‌ అందించే ఆయుష్మాన్​ భారత్​ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గేమ్స్ ఆడుతోంది. స్కీమ్‌‌ను అమలు చేయకుండానే చేసినట్లు చెప్పుకుంటోంది. ఇప్పటిదాకా కనీసం గైడ్​లైన్స్ కూడా రిలీజ్ చేయకుండానే.. దాదాపు 1.19 లక్షల మందికి ట్రీట్‌‌మెంట్ ఇచ్చినట్లు ప్రకటనలు చేస్తోంది. ఆయుష్మాన్ భారత్ రాష్ట్రంలో అమలవుతోందని, ఇందుకోసం ఇప్పటికే రూ.259 కోట్లు ఖర్చు చేశామని ఇటీవల అసెంబ్లీలో మంత్రి హరీశ్​రావు చెప్పారు. మే 18 వ తేదీ నుంచే ఈ స్కీమ్ ఉందని వెల్లడించారు. అయితే ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో ఎక్కడా ఈ స్కీమ్ అమలైతలేదు. కానీ ఈ స్కీమ్‌‌ కింద రూ.కోట్లలో ఖర్చు పెట్టామని సర్కారు చెబుతుండటం గమనార్హం.

నిరుటి నుంచి ప్రకటనలే

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ స్కీమ్‌‌లను కలిపి అమలు చేస్తామని గతేడాది డిసెంబర్‌‌‌‌లో ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటన రిలీజ్ చేశారు. ఈ స్కీమ్ అమలుకు విధివిధానాలన్నీ ఖరారు అయ్యాయని ఈ ఏడాది మే 18న సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆయుష్మాన్‌‌‌‌ కింద ప్రజలు చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌‌‌‌ను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ నెట్‌‌వర్క్ హాస్పిటల్స్‌‌‌‌లో ఆయుష్మాన్ చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలంటూ అదే రోజు హెల్త్ సెక్రటరీ ఉత్తర్వులిచ్చారు. కానీ ఇప్పటిదాకా పథకం అమలుకు సంబంధించిన గైడ్‌‌లైన్స్‌‌ను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఆయుష్మాన్ స్కీమ్ ఏయే హాస్పిటళ్లలో అమలవుతుందనే విషయాన్ని కూడా వెల్లడించలేదు. అర్హులైన పేదలకు ఇతర రాష్ట్రాల్లో ఆయుష్మాన్ భారత్ కార్డులు జారీ చేయగా.. ఇక్కడ అలాంటి కార్డులేవీ ఇవ్వలేదు. అసలు స్కీమ్ అమలు చేస్తున్నట్టు తమకు సమాచారమే రాలేదని ఆరోగ్యశ్రీ నెట్‌‌‌‌వర్క్ హాస్పిటళ్ల యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో ఆయుష్మాన్ పరిధిలోకి వచ్చే జబ్బులకు చికత్సను  నిరాకరిస్తున్నాయి.

పేదలకు లక్షల్లో ఖర్చు

ఆయుష్మాన్ భారత్ అమలైతే కరోనాతోపాటు, డెంగీ, మలేరియా తదితర 1,350 రకాల రోగాలకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచితంగా ట్రీట్‌‌‌‌మెంట్ పొందే అవకాశం ఉంది. రాష్ట్రంలో 26.11 లక్షల పేద కుటుంబాలు ఆయుష్మాన్ స్కీమ్‌‌‌‌కు అర్హులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ రాష్ట్రంలో ఒక్కరు కూడా ఆ పథకం కింద సేవలు అందుకోలేదు. కరోనా, డెంగీ బాధితులు ప్రైవేటు, కార్పొరేట్​హాస్సిటళ్లకు వెళ్లి తిప్పలు పడుతున్నారు. లక్షల్లో బిల్లులు కట్టలేక అప్పుల పాలవుతున్నారు. కొందరు ఆస్తులు అమ్మి ట్రీట్​మెంట్ చేయించుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో మే, జూన్‌‌‌‌, జులై నెలల్లో వేల సంఖ్యలో కరోనా పేషెంట్లతో ప్రైవేట్​హాస్పిటళ్లు కిక్కిరిసిపోయాయి. ఈ ఆర్నెల్లలో కొన్ని వేల మంది పేదలు డెంగీ, మలేరియా బారిన పడ్డారు. కానీ ఆరోగ్యశ్రీలో డెంగీ, మలేరియా కవర్ కావడం లేదు. ఆయుష్మాన్‌‌‌‌లో కవర్ అయ్యే అవకాశం ఉన్నా అది ఎక్కడ​ అమలవుతోందో తెలియకపోవటంతో బాధితులు ఇల్లు గుల్ల చేసుకున్నారు. రెండు స్కీమ్‌‌‌‌లు అమలు అవుతున్నట్టు చెప్పుకోవడమే తప్ప.. ఆయుష్మాన్ పరిధిలోకి వచ్చే సేవలు ఏయే హాస్పిటళ్లలో అందుతున్నాయి, ఎవరిని సంప్రదించాలో  ప్రభుత్వం ప్రకటించకపోవటం గమనార్హం.

నిధుల మళ్లింపుకేనా?

ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఏయే ప్రైవేటు హాస్పిటళ్లలో అమలు అవుతున్నదనే విషయంపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వెబ్‌సైట్‌లోనూ వివరాలు లేవు. ఇదే విషయంపై ఆఫీసర్లను ప్రశ్నిస్తే.. తమకేమీ తెలియదని బదులిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఆయుష్మాన్ అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆయుష్మాన్ కింద ట్రీట్‌మెంట్ తీసుకున్న పేషెంట్ల కోసం రూ.259 కోట్ల ఖర్చు చేసినట్టు మంత్రి ప్రకటిం చారు. అసలు స్కీమే అమలు చేయకుండా.. ఈ 259 కోట్లు ఎవరికి ఇచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రం ఆయుష్మాన్ కింద ఇచ్చే నిధులను వేరే పథకాలకు మళ్లిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మాకేం తెల్వదు

ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అమలు చేస్తున్నరో, లేదో మాకు తెలియదు. దీనిపై కనీసం మాతో ఒక్కసారి కూడా సమావేశం నిర్వహించలేదు. రెండు స్కీమ్‌లు కలిపి అమలు చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నట్టు మీడియాలో చూస్తున్నాం. అంతే తప్ప గైడ్‌లైన్స్‌ రాలేదు.

‑ డాక్టర్ రాకేశ్, ప్రెసిడెంట్, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్