రోజుకు 350 కేసులు.. పిల్లలపై నేరాలు

రోజుకు 350 కేసులు.. పిల్లలపై నేరాలు
  • 2017లో 1,29,032 కేసులు
  • 19 వేల కేసులతో ఉత్తర​ప్రదేశ్​,  మధ్యప్రదేశ్​ టాప్​
  • కిడ్నాప్​లే ఎక్కువ.. 54,163 కేసులు
  • 32,608 అత్యాచారాలు,  లైంగిక వేధింపులు

పిల్లలపై రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక ఘోరానికి చిన్నారులు బలైపోతున్నారు. 2017లో రోజూ పిల్లలపై  సగటున 350 నేరాలు జరిగాయి. ఈ జాబితాలో ఉత్తర​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. పిల్లల హక్కుల సంస్థ ద చైల్డ్​ రైట్స్​ అండ్​ యూ (క్రై– సీఆర్​వై) ఈ వివరాలు వెల్లడించింది. నేషనల్​ క్రైం రికార్డ్స్​ బ్యూరో (ఎన్​సీఆర్​బీ) ప్రకారం 2016–17లో పిల్లలపై నేరాలు 20 శాతం పెరిగాయని చెప్పింది. మొత్తం నేరాల్లో పెరుగుదల 3.6 శాతంగా ఉంటే పిల్లలపై మరీ ఎక్కువగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘పదేళ్ల లెక్కలు తీసుకుంటే 2007 నుంచి 2017 మధ్య పిల్లలపై నేరాలు 1.8 శాతం నుంచి 28.9 శాతానికి పెరిగాయి. 2016లో 1,06,958 నేరాలు జరిగితే, 2017లో 1,29,032కు పెరిగింది” అని క్రై వివరించింది. ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​లలో 19 వేల చొప్పున కేసులు నమోదయ్యాయని, మొత్తం పిల్లలపై జరిగిన నేరాల్లో ఆ రాష్ట్రాల వాటా 14.8 శాతమని పేర్కొంది. అయితే, నేరాల పెరుగుదలలో మాత్రం జార్ఖండ్​ టాప్​లో ఉందని చెప్పింది. ఆ రాష్ట్రంలో పిల్లలపై నేరాలు 73.9 శాతం పెరిగాయని తెలిపింది. మణిపూర్​లో 18.7 శాతం తగ్గుదల నమోదైందని చెప్పింది. బాలికలపై నేరాలు 37 శాతం పెరిగాయని చెప్పింది. హర్యానా, అస్సాంలలోనే 60 శాతం కేసులు నమోదయ్యాయని చెప్పింది.

కిడ్నాప్​లే ఎక్కువ.. మహారాష్ట్ర టాప్​

పిల్లలపై మొత్తం నేరాల్లో కిడ్నాప్​లే ఎక్కువగా ఉన్నాయని క్రై ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం కేసుల్లో 54,163 కిడ్నాప్​లు జరిగాయని, దాని వాటా 42 శాతమని వివరించింది. ఈ జాబితాలో మహారాష్ట్ర టాప్​లో నిలిచిందని చెప్పింది. చిన్న పిల్లల పెళ్లిళ్లూ 21.17% పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 1.2 కోట్ల మందికి ఏమీ తెలియని చిన్నతనంలోనే పెళ్లిళ్లు జరిగాయని, అందులో 75% మంది అమ్మాయిలేనని పేర్కొంది. ప్రొహిబిషన్​ ఆఫ్​ చైల్డ్​ మ్యారేజ్​ యాక్ట్​ ప్రకారం 2017లో 395 కేసులు నమోదయ్యాయని వివరించింది. ప్రొటెక్షన్​ ఆఫ్​ చిల్డ్రెన్​ ఫ్రమ్​ సెక్సువల్​ అఫెన్సెస్​ (పోక్సో) చట్టం కింద 2017లో 32,608 లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులు నమోదయ్యాయని తెలిపింది. 2016లో ఈ సంఖ్య 36,022 అని వివరించింది. పిల్లలపై అత్యాచారాలు చేస్తున్న వారిలో 94% మంది నిందితులు బాధితులకు బాగా తెలిసినవారేనని క్రై ఆవేదన వ్యక్తం చేసింది. అత్యాచార బాధితుల్లో 99% మంది బాలికలేనని తెలిపింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్​, కర్ణాటక, గుజరాత్​, పశ్చిమబెంగాల్​, తమిళనాడుల్లోనే 40% కేసులు నమోదవుతున్నట్టు చెప్పింది.