V6 News

సికింద్రాబాద్ లో భారీగా డ్రగ్స్ సీజ్.. రూ.11.4 కోట్ల విలువైన క్రిస్టల్ మెత్ స్వాధీనం

సికింద్రాబాద్ లో భారీగా డ్రగ్స్ సీజ్.. రూ.11.4 కోట్ల విలువైన క్రిస్టల్ మెత్ స్వాధీనం

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ స్టేషన్​లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రైల్వే స్టేషన్​లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ) అధికారులు సోమవారం జరిపిన తనిఖీల్లో సుమారు రూ.11.4 కోట్ల విలువైన 11 కిలోల ‘క్రిస్టల్ మెత్’ అనే డ్రగ్స్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు.

నిందితులు చాలా తెలివిగా డ్రగ్స్ ప్యాకెట్లను నల్లటి కవర్లు, డిజైనర్ పేపర్లతో చుట్టి, బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షీట్ల మడతల మధ్య దాచిపెట్టారు. రైలులో ప్రయాణిస్తున్న వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన అధికారులు.. వారి ట్రాలీ బ్యాగులను చెక్ చేయగా 10 ప్లాస్టిక్ ప్యాకెట్లలో తెల్లటి స్పటిక పదార్థం కనిపించింది. డ్రగ్స్ కిట్ ద్వారా వీటిని పరీక్షించగా, అది అత్యంత ప్రమాదకరమైన ‘క్రిస్టల్ మెత్’ అని తేలింది. దీంతో అధికారులు ఆ డ్రగ్స్​ను సీజ్ చేసి, నిందితులను రిమాండ్​కు తరలించారు. కాగా, నిందితులను వివరాలను అధికారులు బయటకు చెప్పలేదు. ఈ భారీ నెట్​వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో విచారణ చేస్తున్నారు.