గుడిలో ఇరుక్కున్న మొసలి… దేవుడంటూ పూజలు

గుడిలో ఇరుక్కున్న మొసలి… దేవుడంటూ పూజలు

గుజరాత్ రాష్ట్రంలో ఈ వింత సంఘటన జరిగింది. మహిసాగర్ జిల్లా పల్లా గ్రామంలోని ఖొడియార్ గుడి ఆదివారం నాడు జనంతో నిండిపోయింది. అందుకు కారణం ఒక మొసలి. ఆ మొసలి ఆలయం ఆవరణలోని ఓ చిన్న మందిరం గర్భగుడిలో ఇరుక్కుపోయింది. పక్కనే ఉన్న చెరువులోంచి వచ్చిన మొసలి.. నాలుగువైపులా తెరిచి ఉన్న చిన్న మందిరం నుంచి దూరిపోయేందుకు ప్రయత్నించింది. అంతే.. అటూ ఇటూ ఎటూ పోలేక గోడల మధ్య ఇరుక్కుపోయింది.

స్థానికులు ఈ గుడిలో ఖొడియా మాత, ఖొడియా దేవత కొలువై ఉంటుందని నమ్ముతారు. దేవతకు పూజలు చేస్తుంటారు. మొసలి ఆమె వాహనం.  దీంతో… ఆ మొసలి గుడికి రావడం అమ్మవారి మహిమగా భావించారు. దానికి పూజలు చేశారు.

విషయం తెల్సుకున్న అటవీ అధికారులు గుడికి వచ్చారు. ఐతే.. ఫారెస్ట్ ఆఫీసర్స్ ను స్థానికులు మొదట అడ్డుకున్నారు. అది మహిమ అని చెప్పారు. స్థానికులకు చాలాసేపు నచ్చచెప్పి అధికారులు ఆ మొసలిని రక్షించే ప్రయత్నం చేశారు.

17 కేజీల బరువు.. 6 అడుగుల పొడవున్న మొసలిని గర్భగుడి నుంచి బయటకు లాగి.. దగ్గర్లో ఉన్న చెరువు నీళ్లలో వదిలారు అటవీ అధికారులు.