- అధికారులకు సీఎస్ రామకృష్ణారావు ఆదేశం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో ‘ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఈపీటీఆర్ఐ)’ క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరముందని సీఎస్ రామకృష్ణారావు అన్నారు. శనివారం ఆయన సెక్రటేరియెట్ లో ‘ఈపీటీఆర్ఐ’ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా పర్యావరణ మార్పులపై లోతైన పరిశోధనలు జరగాలన్నారు. ముఖ్యంగా యువతలో అవగాహన పెంచేందుకు జేఎన్టీయూ, ఉస్మానియా వర్సిటీ విద్యార్థులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థులకు పర్యావరణ అంశాలపై ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు, అవగాహన తరగతులు నిర్వహించడంతో పాటు పరిశోధన పత్రాల ప్రచురణను మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. అలాగే, వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పర్యావరణ హిత చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, నీరు, వాయు కాలుష్య నియంత్రణ వంటి కీలక అంశాల్లో ‘ఈపీటీఆర్ఐ’ చురుకైన పాత్ర పోషించాలన్నారు.
