చెన్నై: ఐపీఎల్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఐదుసార్లు టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ‘ఇడ్లీ, దోశ, సాంబార్’ చిచ్చు మొదలైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ నెల 5న జరిగిన మ్యాచ్ సందర్భంగా అక్కడి డీజే ప్రవర్తనపై చెన్నై మేనేజ్‌మెంట్ బీసీసీఐకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. మ్యాచ్ టైమ్‌లో ‘ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ’ అనే పాటను ప్లే చేస్తూ తమిళ అస్తిత్వాన్ని, సంస్కృతిని కించపరిచేలా డీజే వ్యవహరించారని సీఎస్కే తన ఫిర్యాదులో అభ్యంతరం వ్యక్తం చేసింది.
సాధారణంగా సోషల్ మీడియా మీమ్స్‌లో సౌత్ ఇండియన్స్‌ను వెక్కిరించడానికి వాడే ఈ పదాన్ని స్టేడియంలో ప్లే చేయడం సరికాదని పేర్కొంది. 2025లో ఆర్సీబీ ప్లేయర్ జితేష్ శర్మ ఇదే తరహాలో ‘ఇడ్లీ, దోశ’ అంటూ పాడుతున్న వీడియో వైరల్ కావడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఆ టైమ్‌లో సీఎస్కే ఫ్యాన్స్ నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఇప్పుడు చిన్నస్వామి స్టేడియం డీజే మళ్ళీ అదే పాటతో కవ్వింపు చర్యలకు దిగడంపై సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్టేడియం డీజేలు హోమ్ టీమ్‌కు మద్దతు ఇవ్వడం వేరని, కానీ ప్రత్యర్థి జట్టును, వారి ప్రాంతీయతను వెక్కిరించేలా ప్రవర్తించడం సరికాదన్నాడు. ఈ ఫిర్యాదుపై బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి

