Vishwak Sen CULT Teaser: రక్తపాతం.. వణుకు పుట్టించే వయోలెన్స్.. విశ్వక్ సేన్ ‘కల్ట్’ టీజర్ విధ్వంసం!

Vishwak Sen CULT Teaser: రక్తపాతం.. వణుకు పుట్టించే వయోలెన్స్.. విశ్వక్ సేన్ ‘కల్ట్’ టీజర్ విధ్వంసం!

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి వెండితెరపై సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యారు.  ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కల్ట్’ (CULT) రెడ్ బ్యాండ్ టీజర్ ను ఈరోజు (  ఫిబ్రవరి 21న ) రిలీజ్ చేశారు.  ఇండియాలో మొట్టమొదటి ప్రాపర్ ‘స్లాషర్’ (Slasher) చిత్రంగా వస్తున్న ఈ సినిమా టీజర్ చూస్తుంటే , టాలీవుడ్‌లో ఇప్పటివరకు చూడని రక్తపాతం, వయోలెన్స్‌ను విశ్వక్ పరిచయం చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది.

వణుకు పుట్టించే హింస!

2 నిమిషాల 33 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్.. ఒక అండర్ గ్రౌండ్ పార్టీలో మొదలై, ఒక్కసారిగా రక్తపాతంగా మారిపోతుంది. ఒక వింతైన పింక్ టాయ్ (Pink Toy) కారణంగా మొదలయ్యే ఈ గందరగోళం, కత్తులతో పొడుచుకోవడం, భయంకరమైన హత్యలతో నిండిపోయింది. తన మునుపటి చిత్రాలైన 'ఫలక్‌నుమా దాస్', 'దాస్ కా ధమ్కీ' సినిమాలకు పూర్తి భిన్నంగా, విశ్వక్ సేన్ ఈ చిత్రంలో ఒక నీడలాంటి గేమ్ మాస్టర్‌గా కనిపించి షాక్ ఇచ్చారు.

తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకరాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ కథానాయికగా నటిస్తుండగా, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగర్, కార్తికేయ వంటి వారు కీలక పాత్రల్లో ఉన్నారు. ఈ సినిమా ద్వారా ఏకంగా 100 మంది కొత్త నటీనటులను విశ్వక్ సేన్ పరిచయం చేస్తున్నారు. ఈ మూవీకి ఆయనే దర్శకత్వం వహించారు.

రోలెక్స్ వాచ్ గిఫ్ట్!

ఈ టీజర్ లాంచ్ వేడుకలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఆయన వర్క్‌కు ఫిదా అయిన విశ్వక్ సేన్, వేదికపైనే రవి బస్రూర్‌కు ఖరీదైన రోలెక్స్ (Rolelex) వాచ్‌ను బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఇది నా ఫేవరెట్ గిఫ్ట్స్‌లో ఒకటి. రవి గారి సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసిందని విశ్వక్ సేన్ అన్నారు. దీనికి రవి బస్రూర్ మాట్లాడుతూ.. నేను 25 ఏళ్లుగా పనిచేస్తున్నాను. కానీ మొదటిసారి ఒక వ్యక్తి నాలోని సంగీత దర్శకుడిని మాత్రమే కాదు,  నన్ను ఇంతలా గౌరవిస్తున్న వ్యక్తి విశ్వక్  అంటూ ఎమోషనల్ అయ్యారు.
 
గ్రాండ్ గా రిలీజ్

విశ్వక్ సేన్ ప్రాణ స్నేహితుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి పదునైన డైలాగ్స్ అందించారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్, జపనీస్, మరియు స్పానిష్ వంటి అంతర్జాతీయ భాషల్లో కూడా ‘కల్ట్’ విడుదల కానుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. హారర్ జానర్‌లో ‘స్లాషర్’ అనేది ఇండియాకు కొత్త ప్రయోగం కావడంతో, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.