సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో వరుసగా జరుగుతున్న సైబర్ మోసాలపై కేసులు నమోదు అవుతున్నాయి. అమీన్ పూర్ పరిధిలో నివాసముంటున్న ప్రైవేట్ ఉద్యోగులే టార్గెట్ చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రెండు రోజుల వ్యవధిలో సుమారు రూ. 57 లక్షలు కాజేశారు సైబర్ నేరస్తులు. రెండు రోజుల క్రితం అమీన్ పూర్ లో నివసిస్తున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ మహిళా ఉద్యోగులకు రెట్టింపు డబ్బు ఆశ చూపిన కేటుగాళ్ళు వారి వద్ద నుండి భారీ మొత్తంలో దోచేశారు. అధిక డబ్బుకు ఆశపడి ఓ మహిళా రూ. 21 లక్షలు, మరో మహిళ రూ. 4.6 లక్షలు పొగుట్టుకున్నారు.
ఇక మే 2వ తేదీ మంగళవారం ఇద్దరు వ్యక్తులను టాస్క్ ల పేరుతో బురిడీ కొట్టించి భారీగా డబ్బు కాజేశారు. వారం రోజుల వ్యవధిలో ఓ వ్యక్తి నుంచి రూ.30 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ.1.60 లక్షల కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. దీంతో సైబర్ క్రైమ్ అధికారులకు అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అమీన్ పూర్ పోలీసులు దర్యప్తు చేస్తున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు ఎంత అవగాహన కప్పించినా మళ్లీమళ్లీ మోసపోతున్నారని.. అధిక డబ్బుకు ఆశపడి ఉన్న డబ్బు పోగొట్లుకోవద్దని అధికారులు సూచించారు.

