మాజీ ఐఏఎస్​కు సైబర్ నేరగాళ్ల టోకరా....ట్రేడింగ్ టిప్స్ ఇస్తామని రూ.3.37 కోట్లు లూటీ

మాజీ ఐఏఎస్​కు సైబర్ నేరగాళ్ల టోకరా....ట్రేడింగ్ టిప్స్ ఇస్తామని రూ.3.37 కోట్లు లూటీ

హైదరాబాద్‌‌, వెలుగు: మాజీ ఐఏఎస్ అధికారి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.3.37 కోట్లు పోగొట్టుకున్నారు. ధని సెక్యూరిటీస్​లో ఇన్వెస్ట్​మెంట్ పేరుతో మోసపోయారు. చివరికి టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్​బీ) అధికారులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలో నివాసం ఉంటున్న మాజీ ఐఏఎస్‌‌ అధికారి ఖాజ రత్నకిషోర్‌‌కి ఆన్‌‌లైన్‌‌లో ధని సెక్యూరిటీస్‌‌ పేరుతో వెబ్‌‌సైట్‌‌ కనిపించింది. ట్రేడింగ్ ప్లాట్​ఫామ్ అని తెలుసుకున్న ఆయన.. ట్రేడింగ్ చేసేందుకు ఆసక్తి చూపారు. దీంతో సైబర్ నేరగాళ్లు ధని చాట్‌‌ పేరుతో లింక్‌‌ పంపించి పాస్‌‌వర్డ్‌‌తో లాగిన్ ఇచ్చారు. ఈ క్రమంలోనే అర్జున్ మెహతా పేరుతో ఓ మహిళ సంప్రదింపులు జరిపింది. మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓ, ఆప్షన్స్ ట్రేడింగ్ ప్లాట్‌‌ఫామ్‌‌లో సబ్‌‌స్క్రిప్షన్ చేయించింది.

భారీగా లాభాలు వస్తాయని నమ్మించి..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌‌ (ఏఐ) ఆధారిత మ్యూచుఫల్ ఫండ్స్‌‌గా సైబర్ నేరగాళ్లు నమ్మించారు. ట్రేడింగ్‌‌ ఆప్షన్స్‌‌ రెకమండ్‌‌ చేశారు. ఏఐ టూల్స్‌‌ ద్వారా కచ్చితంగా 10 శాతానికి పైగా లాభాలు వస్తాయని చెప్పారు. 30 నుంచి 40 శాతం వరకు లిస్టెడ్ లాభాలతో పాటు120 నుంచి 160 శాతం వరకు లాభాలు వస్తాయని ఆశ చూపారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు సాయంత్రం 7.30 గంటలకు వాట్సాప్ చాటింగ్‌‌ చేసేవారు. షేర్ మార్కెట్ ట్రెండ్‌‌లు, ట్రేడింగ్ సలహాలు ఇచ్చేవారు. ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విడతల వారీగా రూ.3.15 కోట్లు వసూలు చేశారు.

 తాను పెట్టిన పెట్టుబడిలో వచ్చిన లాభాలను విత్‌‌డ్రా చేసుకునేందుకు మాజీ ఐఏఎస్‌‌ అధికారి ప్రయత్నించారు. దీంతో సైబర్ నేరగాళ్లు అప్రమత్తమయ్యారు. ట్రేడింగ్ అకౌంట్‌‌లో రూ.5.5 కోట్లు డెబిట్‌‌ అయ్యిందని చెప్పారు. ఫైనల్ సెటిల్‌‌మెంట్‌‌ ద్వారా మొత్తం రూ.25.91 కోట్లు విత్‌‌డ్రా చేసుకునే అవకాశం ఉందని నమ్మించారు. ఇలా ప్రాసెసింగ్ ఫీజు సహా మొత్తం రూ.3,37,16,118 వసూలు చేసి మోసం చేశారు. దీంతో బాధితుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించారు.