ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించా: అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఫస్ట్ రియాక్షన్

ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించా: అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఫస్ట్ రియాక్షన్

న్యూఢిల్లీ: సభలో తాను పక్షపాత ధోరణి చూపించానన్న ప్రతిపక్షాల ఆరోపణలను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. తాను ఎల్లప్పుడూ సభ కార్యకలాపాలను నిష్పాక్షికంగా, క్రమశిక్షణతో నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడానికి ప్రయత్నించానని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా సభలో ప్రతి సభ్యుడిగా మాట్లాడే అవకాశం కల్పించానని చెప్పారు. ప్రతి ఎంపీకి నిబంధనల ప్రకారం సభలో మాట్లాడే హక్కు ఉందని స్పష్టం చేశారు. సభలో పక్షపాతం చూపిస్తున్నారని స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 

ఈ తీర్మానంపై లోక్ సభలో దాదాపు 12 గంటల చర్చ జరిగింది. అనంతరం మూజువాణి ఓటుతో ఈ తీర్మానం వీగిపోయింది. దీంతో గురువారం (మార్చి 12) స్పీకర్ ఓం బిర్లా సభకు హాజరై అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభలో అందరికి సమాన అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సభ నియమాలకు కట్టుబడే అందరికీ అవకాశాలు ఇస్తామని చెప్పారు. 

విపక్షాలు మాట్లాడితేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని పేర్కొన్నారు. తాను పక్షపాత ధోరణితో వ్యవహరించానన్న ప్రతిపక్షాల ఆరోపణను ఆయన తోసిపుచ్చారు. తాను ఎల్లప్పుడూ సభ కార్యకలాపాలను నిష్పాక్షికంగా, క్రమశిక్షణతో నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడానికి ప్రయత్నించానని అన్నారు.

సభలో ఎంపీల మైక్రోఫోన్‌లను తాను నియంత్రించాననే ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. మైక్‌ను నియంత్రించడానికి తనకు స్విచ్ లేదని నొక్కి చెప్పారు. సభలో ఎవరూ నిబంధనలకు అతీతులు కారని.. బిర్లా నొక్కి చెప్పారు. ప్రధానమంత్రి, మంత్రులు కూడా ప్రకటనలు చేయడానికి సభ నిబంధనల ప్రకారం నోటీసు ఇవ్వాలని పేర్కొన్నారు.