భారత్ సమిట్ కాదు.. దేశ వ్యతిరేక సమిట్..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ

భారత్ సమిట్ కాదు.. దేశ వ్యతిరేక సమిట్..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్‌‌ హైటెక్స్‌‌ వేదికగా నేడు, రేపు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న భారత్‌‌ సమిట్‌‌పై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇది భారత్‌‌ సమిట్‌‌ కాదని.. దేశ వ్యతిరేక సమ్మిట్ అని ఆరోపించారు. దేశ అభివృద్ధిని అడ్డుకునే, రాజ్యాంగబద్ధ సంస్థలను బద్నాం చేసే శక్తులకు హైదరాబాద్‌‌ను వేదికగా మారుస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్‌‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

 కాంగ్రెస్‌‌ పార్టీ కార్యక్రమానికి ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తారని ప్రశ్నించారు. అసలు ఈ సమిట్‌‌ను ఎవరు నిర్వహిస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సమిట్‌‌తో దేశంలోకి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కుట్ర కాంగ్రెస్‌‌ పన్నుతోందని ఆరోపించారు. రాహుల్‌‌ గాంధీ విజన్‌‌ను ప్రపంచ దేశాలకు పరిచయం చేసేందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్‌‌ చెబుతోందని పేర్కొన్నారు. రాహల్​విజన్​ ఏంటో సమిట్​లో చెప్పాలని డిమాండ్​ చేశారు.