IPL 2026: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ఎఫెక్ట్ రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణ అంతరాయాలతో ఆయా జట్లు, ఆటగాళ్ల రాకపై ఆందోళన కలిగిస్తుంది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, యూఎస్ మధ్య వరుసగా దాడులు కొనసాగుతుండటంతో.. దుబాయ్, దోహా వంటి ముఖ్యమైన ఎయిర్‌ఫ్లైట్ హబ్‌లలో గగనతలం మూసివేయడం ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌లను ప్రభావితం చేసింది. ఐపీఎల్ టోర్నమెంట్ కోసం భారతదేశానికి సకాలంలో చేరుకోవడంలో అనేక మంది విదేశీ ఆటగాళ్ళు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని టోర్నమెంట్ నిర్వాహకులు భావిస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన సౌతాఫ్రికా, వెస్టిండీస్ ఆటగాళ్లకు ఇప్పటికే ప్రయాణంలో ఆలస్యమైనట్లు వార్తలు వచ్చాయి. ఒక టీమ్ అధికారిక ప్రతినిథి మాట్లాడుతూ.. ఆటగాళ్లను షెడ్యూల్ ప్రకారం భారత్‌కు తీసుకురావడం “కష్టం” అవ్వొచ్చని హెచ్చరించారు. అలాగే యుద్ధం కారణంగా విమాన టికెట్ ఖర్చులు పెరగడం, టీమ్ లాజిస్టిక్స్ పై మరింత భారం పడుతుందని పేర్కొన్నారు. ఫ్రాంచైజీలు ఇంకా తమ అంతర్జాతీయ ప్లేయర్స్ సమయానికి చేరుకుంటారనే ఆశలను వదిలి పెట్టుకున్నట్లు తెలుస్తుంది. కాగా చెన్నై సూపర్ కింగ్స్ లాంటి జట్ల అధికారులు, డివాల్డ్ బ్రెవిస్, ఆకీల్ హోసెయిన్ వంటి ఆటగాళ్లు వారి ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందే జట్టులో చేరతారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఇరాన్– ఇజ్రాయెల్– అమెరికా మధ్య యుద్ధం ఉద్రిక్తంగా మారడంతో ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తూ, గ్లోబల్ లో నెలకొన్న రాజకీయ ఘర్షణలు క్రికెట్‌లోని అతి పెద్ద లీగ్‌లలో ఒకటైన IPLపై భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, ఇప్పటికే బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి సంబంధించిన 20 రోజుల షెడ్యూల్ ని మాత్రమే విడుదల చేసింది. మార్చి 28వ తేదీ నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది.
