ఉద్యోగం ఓకే అన్నారు.. ఆఫర్ లెటర్ ఇవ్వలేదు : టెక్ మహీంద్రలో వెయ్యి మంది ఫ్రెషర్స్ పరిస్థితి..!

ఉద్యోగం ఓకే అన్నారు.. ఆఫర్ లెటర్ ఇవ్వలేదు : టెక్ మహీంద్రలో వెయ్యి మంది ఫ్రెషర్స్ పరిస్థితి..!

ఐటీ జాబ్ కొట్టాం.. ఇక లైఫ్ సెటిల్ అని ఊహించుకున్న వేలాది మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇప్పుడు వెయిటింగ్ తప్పడం లేదు. దేశీయ దిగ్గజ సంస్థ టెక్ మహీంద్రా 2025 బ్యాచ్‌కు చెందిన దాదాపు 1,000 మందికి పైగా ఫ్రెషర్ల ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను నిలిపివేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలోని వివిధ కాలేజీలకు చెందిన ఈ విద్యార్థులు జనవరి-ఫిబ్రవరి 2025లోనే అన్ని రౌండ్ల ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని.. సెలెక్ట్ అయినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ వారి చేతికి ఆఫర్ లెటర్లు అందకపోవటంతో ఫ్రెషర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ఏఐ ప్రభావం మధ్య కంపెనీ లాభాల మార్జిన్లను పెంచుకోవాలనే వ్యూహంతో కొత్త రిక్రూట్మెంట్లను టెక్ మహీంద్రా తగ్గించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్ల నియామకాలను గణనీయంగా తగ్గించనున్నట్లు కంపెనీ సీఈఓ మోహిత్ జోషి ఇప్పటికే స్పష్టం చేశారు. గత ఏడాది 6వేల మందిని తీసుకున్న కంపెనీ.. ఈసారి బెంచ్ మీద ఉన్న ఉద్యోగులను, ప్రస్తుతం ఉన్న టాలెంట్ పూల్‌ను వాడుకోవడానికే మొగ్గు చూపుతోంది. దీనివల్ల క్యాంపస్ సెలక్షన్‌ లో ఎంపికైన అభ్యర్థులు ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోయారు.

హైరింగ్ ఆలస్యం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక వేదన వర్ణనాతీతం. మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని ఊరంతా తెలిసిపోయింది.. ఇప్పుడు ఆఫర్ లెటర్ రాలేదని చెబితే బంధువులు, పొరుగువారు ఏమనుకుంటారోనని సొంత ఊరికి కూడా వెళ్లలేకపోతున్నానంటూ పూణేలో చదువుకున్న ఒక విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు కాలేజీ ప్లేస్‌మెంట్ సెల్స్ కూడా పాత బ్యాచ్ విద్యార్థులను వదిలేసి.. కొత్త బ్యాచ్ నియామకాలపై దృష్టి పెట్టడం వీరిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇతర కంపెనీలకు దరఖాస్తు చేసుకుందామన్నా.. ప్రస్తుతం ఐటీ మార్కెట్ చాలా క్లిష్టంగా ఉండటంతో పాటు ఏడాదిగా ఖాళీగా ఉండటం ఇబ్బంది కరంగా మారిందని వారు వాపోతున్నారు. 

కేవలం టెక్ మహీంద్రా మాత్రమే కాదు.. విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి ఇతర సంస్థలు కూడా గతంలో ఇదే తరహాలో ఆన్‌బోర్డింగ్‌ను ఆలస్యం చేశాయి. ఈ సమస్యపై ఐటీ ఉద్యోగుల సంఘం స్పందిస్తూ.. బాధితులంతా ఏకమై ఫిర్యాదు చేస్తే ఈ విషయాన్ని కార్మిక శాఖ దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చింది. ఐటీ కలలతో సాఫ్ట్‌వేర్ రంగంలోకి అడుగుపెట్టాలనుకున్న ఫ్రెషర్లకు.. కంపెనీల నుంచి వస్తున్న వేచి చూసే ధోరణి ఒక పీడకలలా మారింది. కంపెనీలు తమ బిజినెస్ టర్న్‌అరౌండ్ కోసం చూస్తున్నా, అటు విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం కాకూడదని నిపుణులు అంటున్నారు.