ఎక్కువ నీళ్లు తాగితే కిడ్నీ వ్యాధులు నయమవుతాయా ? కిడ్నీ ఆరోగ్యంపై డాక్టర్ల హెచ్చరిక!

ఎక్కువ నీళ్లు తాగితే కిడ్నీ వ్యాధులు నయమవుతాయా ? కిడ్నీ ఆరోగ్యంపై డాక్టర్ల  హెచ్చరిక!

ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కిడ్నీ ఆరోగ్యం గురించి  ముఖ్యంగా నీరు ఎక్కువగా తాగితే కిడ్నీ వ్యాధులు నయమవుతాయనే అపోహ చాల మందికి ఉంటుంది. అయితే సాధారణంగా ఏ ఆరోగ్య సమస్య వచ్చినా నీళ్లు బాగా తాగు.. తగ్గిపోతుంది అని అందరూ చెబుతుంటారు. చర్మం మెరిసిపోవాలన్నా, జీర్ణక్రియ బాగుండాలన్నా నీరు అవసరమే. కానీ ఎక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీ వ్యాధులు నయమవుతాయి అనే మాట మాత్రం ఒక అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు  హెచ్చరిస్తున్నారు.

 మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి కిడ్నీలకు నీరు అవసరం. అయితే, ఇప్పటికే దెబ్బతిన్న కిడ్నీలను నీరు బాగు చేయలేదు. నీరు తాగడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి, కిడ్నీలో రాళ్లు రాకుండా చూసుకోవడానికి సహాయపడుతుంది. కానీ, ఒకసారి కిడ్నీ పాడైతే మాత్రం ఎంత నీరు తాగినా అది రిపేర్ అవ్వదు.

  కిడ్నీ వ్యాధికి  కారణాలు:
కిడ్నీలు కేవలం నీళ్లు తక్కువ తాగడం వల్ల పాడవవు. ఎక్కువగా  మధుమేహం, అధిక రక్తపోటు, ఇన్ఫెక్షన్లు,  ఇతర జన్యుపరమైన సమస్యల వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కేవలం నీళ్లతో కిడ్నీలను కాపాడుకోలేము. అయితే సరైన మందులు, జీవన విధానం  మార్పులు తప్పనిసరి.

 ఎక్కువ నీరు తాగడం ప్రమాదకరమా:
ఆరోగ్యంగా ఉన్నవారు నీళ్లు తాగడం మంచిదే. కానీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ల సలహా లేకుండా అతిగా నీళ్లు తాగకూడదు. కిడ్నీలు బలహీనపడినప్పుడు అవి అదనపు నీటిని బయటకు పంపలేవు. దీనివల్ల శరీరం వాపు రావడం, ఊపిరి ఆడకపోవడం, బీపీ పెరగడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వంటి ప్రమాదాలు జరగవచ్చు.

 రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి?
నీటి అవసరం అనేది మనిషి చేసే పని, వాతావరణం, వారి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. సాధారణ వ్యక్తులు రోజుకు 2 నుండి 3 లీటర్ల ద్రవ పదార్థాలు అంటే నీరు, మజ్జిగ, జ్యూస్ మొదలైనవి  తీసుకోవచ్చు. కిడ్నీ బాధితులు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి 3-4 లీటర్ల నీళ్లు తాగకుండా, మీ డాక్టర్‌ను సంప్రదించి మీరు ఎంత నీరు తాగాలో అడిగి తెలుసుకోవడం ఉత్తమం. కిడ్నీలను కాపాడుకోవాలంటే కేవలం నీళ్లు తాగడం మాత్రమే సరిపోదు. బీపీ, షుగర్ వంటి సమస్యలను కంట్రోల్లో ఉంచుకోవడం, ఎప్పటికప్పుడు మెడికల్ టెస్టులు చేయించుకోవడం చాలా ముఖ్యం.