మైనర్ల చేతికి వాహనాలు..గాల్లో కలుస్తున్న ప్రాణాలు.. 2026 జూన్ నాటికే 3,005 కేసులు

మైనర్ల చేతికి వాహనాలు..గాల్లో కలుస్తున్న ప్రాణాలు.. 2026 జూన్ నాటికే 3,005 కేసులు
  •        2025లో 7,894 మైనర్ డ్రైవింగ్ కేసులు
  •     ఈ 5 నెలల్లోనే ఏడుగురు పిల్లలు మృతి
  •     గాయపడ్డ128 మంది..  చనిపోయిన వారిలో 94 శాతం మంది హెల్మెట్ లేనివారే..

హైదరాబాద్ సిటీ, వెలుగు: పట్టుమని పదేండ్లు కూడా నిండని పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇస్తుండడంతో వారు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు పిల్లలు తమ పేరెంట్స్​కు తెలియకుండా టూవీలర్లపై ఓవర్​స్పీడ్​తో ముగ్గురు, నలుగురు దూసుకుపోతుండడం ఇతర వాహనదారులకు గండంగా మారుతోంది. పిల్లల్లో ఉండే అత్యుత్సాహం, వేగంపై ఉండే మోజుతో ట్రిపుల్​రైడింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తూ తరచూ యాక్సిడెంట్లకు గురవుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేస్తూ భారీ జరిమానాలు వేస్తున్నా మార్పు రావడం లేదు. పైగా ఏటికేడు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 

గతేడాది 8 వేల కేసులు..

మైనర్లకు వాహనం ఇవ్వడం వల్ల కుటుంబాలు కోలుకోలేని విషాదంలో మునిగిపోతున్నాయి. ప్రమాదాల్లో పిల్లలు కొందరు దివ్యాంగులుగా మారితే.. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్​పరిధిలో 2025లో ఏకంగా 7,894 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఈ ఏడాది జూన్ నాటికే 3,005కు చేరుకుంది. పైగా 2026 జనవరి నుంచి మే వరకు హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. 128 మంది పిల్లలు గాయపడగా, ఇందులో 94 శాతం మంది హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారే ఉన్నారు.  


గతేడాది 1,455 లైసెన్సుల రద్దు..


మోటార్ వాహనాల చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు పిల్లలు వాహనం నడపడం తీవ్రమైన నేరం. మైనర్లు వాహనం నడుపుతూ దొరికితే ఆ వాహన యజమాని లేదా తల్లిదండ్రులనే ప్రధాన బాధ్యులను చేస్తూ కఠిన నిబంధనలను రూపొందించారు. భారీ జరిమానాలు, జైలు శిక్షతో పాటు, మైనర్‌‌కు 25 ఏండ్లు వచ్చేదాకా డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉండదు. హైదరాబాద్​కమిషనరేట్​పరిధిలో 2025లో 3,876 మంది, మైనర్లకు, 2026 జూన్ నాటికి 1,613 మంది పిల్లలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల మధ్య జరిమానా విధించారు. అంతేగాకుండా 2025లో తీవ్రమైన చర్యగా 1,455 వాహనాల ఆర్సీలను రద్దు చేయగా, 2026 జూన్ నాటికే 258 ఆర్సీలను రద్దు చేశారు. మైనర్లకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. 

తల్లిదండ్రులదే తప్పు..

మైనర్లకు 18 ఏండ్లు నిండే వరకు వాహనాలు ఇవ్వొద్దు. రెండేండ్లలో 1,703 వాహనాల ఆర్సీలను రద్దు చేశాం. ఒకసారి మైనర్ డ్రైవింగ్ చేసి పట్టుబడితే 25 ఏండ్ల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వొద్దన్న నిబంధనను కచ్చితంగా అమలు చేస్తున్నాం. తల్లిదండ్రులు ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  

- జోయల్ డేవిస్, ట్రాఫిక్ జాయింట్ సీపీ-