కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య బరాజ్ ల లొల్లి ..కృష్ణా, భీమా నదులపై కర్నాటక కట్టిన బ్యారేజ్లపై పాలమూరు నేతల ఫైట్

 కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య బరాజ్ ల లొల్లి ..కృష్ణా, భీమా నదులపై కర్నాటక కట్టిన బ్యారేజ్లపై పాలమూరు నేతల ఫైట్
  • ఉమ్మడి పాలమూరుకు నీళ్లు రావడం లేదంటూ బీఆర్​ఎస్​'కర్నాటక ప్రాజెక్టుల బాట'
  • తెలంగాణ నిర్లక్ష్యంతోనే కర్నాటక బరాజ్​లు కడుతోందని విమర్శలు
  • బీఆర్​ఎస్​ హయాంలోనే బరాజ్​లు నిర్మించారని కాంగ్రెస్ కౌంటర్

మహబూబ్ నగర్, వెలుగు : ఉమ్మడి మహబూబ్ నగర్​జిల్లాలోని ప్రాజెక్టులపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, బీఆర్​ఎస్​పాలమూరు జిల్లా అధ్యక్షుడు సి.లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఇటీవల 'కర్నాటక ప్రాజెక్టుల బాట' ప్రారంభించారు. ఇప్పటికే ఆర్డీఎస్​ను సందర్శించిన ఆ పార్టీ లీడర్లు, రెండు రోజుల కిందట జూరాల ప్రాజెక్టు ఎగువన కృష్ణా, భీమా నదులపై కర్నాటకలో అక్కడి ప్రభుత్వం కట్టిన రోడ్​కం బరాజ్ లను పరిశీలించారు. 

ఈ బరాజ్ లను కర్నాటక ప్రభుత్వం కట్టినా, కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోలేదని బీఆర్ ఎస్ లీడర్లు ఆరోపణలు చేయగా.. బీఆర్​ఎస్​ప్రభుత్వ హయాంలోనే కర్నాటకలో బరాజ్ ల నిర్మాణం జరిగినా అప్పుడు ఎందుకు అడ్డుకోలేదంటూ కాంగ్రెస్ లీడర్లు కౌంటర్ ఇచ్చారు. ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండడంతో జిల్లాలో రాజకీయంగా రసవత్తరంగా మారింది. 

విమర్శలు.. ప్రతివిమర్శలు

కృష్ణా, భీమా నదులపై కర్నాటకలో కట్టిన రోడ్​కం బరాజ్ లతో భవిష్యత్ లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తాగు, సాగు నీటికి ఇబ్బందులు ఏర్పడుతాయని, వర్షాభావ సమయంలో ఈ నదుల నీటిని కర్నాటక అడ్డుకోవడం వల్ల దిగువకు నీరు వచ్చే పరిస్థితి ఉండబోదని, తద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉంటుందని బీఆర్ ఎస్ లీడర్లు చెబుతున్నారు.

 కర్నాటక కట్టిన బరాజ్ ల కారణంగా దిగువన ఉన్న జూరాలతో పాటు నెట్టెంపాడు, కోయిల్​సాగర్​, భీమా, కల్వకుర్తి లిఫ్టులకు నీరందదని, ఈ బరాజ్​నుంచి వచ్చే లీకేజీ నీటిని కూడా దిగువకు రానివ్వకుండా కర్నాటక బరాజ్ కు ఉన్న నీడిల్​గేట్లను తీసేసి, హైడ్రాలిక్​గేట్లను ఏర్పాటు చేసినా కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తున్నారు. 

కాంగ్రెస్ వైఫల్యంపై తాము పాలమూరు ప్రాజెక్టుల బాట చేపడుతున్నాం అని ప్రకటన చేయగానే.. సీఎం రేవంత్ రెడ్డి భయపడి పాలమూరు ప్రాజెక్టుల సందర్శన పేరుతో రెండు రోజుల ఉమ్మడి జిల్లాలోని పర్యటించారని, సీఎం పర్యటించి రెండు నెలలు కావస్తున్నా పాలమూరు ప్రాజెక్టుల్లో కదలిక రావడం లేదని విమర్శిస్తున్నారు. 

బీఆర్ ఎస్ విమర్శలపై కాంగ్రెస్​లీడర్లు కౌంటర్​అటాక్​కు దిగారు. బీఆర్​ఎస్​ హయాంలోనే కర్నాటకలో బరాజ్​ల నిర్మాణాలు జరిగాయని, అప్పుడు అధికారంలో ఉండీ ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ ఎస్ లీడర్లు ప్రాజెక్టుల బాట చేపడుతున్నారని అంటున్నారు. జూరాల ఎగువన తెలంగాణలో భీమా, కృష్ణా నదులపై రోడ్​కం బరాజ్​లను నిర్మించే అవకాశం ఉన్నా బీఆర్ ఎస్ హయాంలో ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తు్న్నారు.

పదేండ్లలో రెండు బరాజ్ లు 

కృష్ణా భాగ్య జల నిగమ్​లిమిటెడ్​(కేబీజేఎన్​ఎల్​) కింద కర్నాటక ప్రభుత్వం కృష్ణా, భీమా నదులపై ప్రతి పది కిలోమీటర్లకు ఒకటి చొప్పున రోడ్​కం బరాజ్​లను నిర్మించింది. ఈ రెండు నదులపై 2014 తర్వాత కర్నాటక రెండు చొప్పున నిర్మించింది. అందులో భీమా నదిపై యాద్గిర్ జిల్లాలోని గూడూరు వద్ద రోడ్​కం బరాజ్​ను 2017లో పూర్తి చేశారు. 

ఈ బరాజ్​కు నీడిల్​గేట్లు ఉండగా.. నీరు లీకేజీ అవుతుండడంతో అదే ఏడాది వర్టికల్​లిఫ్ట్​ గేట్లను ఏర్పాట్లు చేసేందుకు టెండర్లు పిలిచింది. ఈ గేట్ల పనులు 2021లో ప్రారంభించి 2023లో పూర్తి చేయించింది. కృష్ణానదిపై గిరిజాపూర్​ వద్ద 2015లో భారీ రోడ్​ కం బరాజ్​పనులను ప్రారంభించారు. ఒకటిన్నర కిలోమీటర్ల పొడవైన ఈ బరాజ్​పై 194 గేట్లను ఏర్పాటు చేసి 2017లో పూర్తి చేశారు.

మూడు బరాజ్​ల నిర్మాణాలకు డీపీఆర్​ రెడీ

తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలు సంయుక్తంగా జూరాలకు ఎగువన బరాజ్ ల నిర్మాణానికి డీపీఆర్ లు రెడీ చేశాయి. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం కొల్పూరు- కొడ్తికొండ గ్రామాల మధ్య కృష్ణా నదిపై 1.08 టీఎంసీల కెపాసిటీతో ఒకటి, భీమా నదిపై కుసుమర్తి- సుకూర్‌‌లింగంపల్లి గ్రామాల మధ్య 0.4 టీఎంసీల కెపాసిటీతో ఒకటి, తంగిడి వద్ద 0.4 టీఎంసీల కెపాసిటీతో రోడ్​ కం బరాజ్​ను నిర్మించేందుకు ఇప్పటికే ప్రపోజల్స్ రెడీ అయ్యాయి. గత నెల 4న సీఎం రేవంత్​రెడ్డి కర్నాటకకు చెందిన ఇరిగేషన్​శాఖ మంత్రితో కలిసి ఈ బరాజ్​లను నిర్మించే ప్రాంతంలో ఏరియల్​ సర్వే చేశారు. తాజాగా ఈ మూడు బరాజ్​ల నిర్మాణానికి సంబంధించి డీటెయిల్డ్​ ప్రాజెక్టు రిపోర్టును కూడా సిద్ధం చేశారు.