ఈ 20 పెట్రోల్ పోస్టులపై కోర్టుకెక్కిన గడ్కరీ.. మెటా, గూగుల్‎పై దావా

ఈ 20 పెట్రోల్ పోస్టులపై కోర్టుకెక్కిన గడ్కరీ.. మెటా, గూగుల్‎పై దావా

ట్రోల్స్​తో తనకు, తన ఫ్యామిలీకి పరువునష్టం కలుగుతోంది
దుష్ప్రచారానికి వేదిక కల్పిస్తున్నారని మెటా, గూగుల్​పై దావా
సీజేపీ తరహాలో ఏర్పడిన ‘ఈ 20 జనతా పార్టీ’

ముంబై: ఈ20 పాలసీ ద్వారా తాను, తన కుటుంబం లబ్ధి పొందుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్, ఇతరులపై సివిల్ దావా వేయడానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన మెటా (ఫేస్‌‌‌‌బుక్, ఇన్‌‌‌‌స్టాగ్రామ్), ఎక్స్, గూగుల్‌‌‌‌ పై దావా వేసేందుకు సిద్ధమవుతున్నారు. 

ఈ20 పాలసీతో వచ్చే లాభాలకు తనను, తన కుటుంబాన్ని ముడిపెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు, డీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫేక్ చిత్రాలు, వీడియోలతో సహా ఇతర కంటెంట్ ప్రచారం చేస్తూ.. తన పరువుకు నష్టం కలిగించేలా కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వ్యాప్తి చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్ పై దావా వేయడానికి అనుమతించాలని గడ్కరీ ఇటీవల బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 

ఈ ప్రచారం అవాస్తవమైనదని, దురుద్దేశపూరితమైనదని, ప్రజలను తప్పుదోవ పట్టించి, తన ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో ఉందని గడ్కరీ తన పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ20 పాలసీతో సహా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోకి రాదని.. అది పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని, అందువల్ల తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవ విరుద్ధమని గడ్కరీ స్పష్టం చేశారు. 

ఈ నేపథ్యంలో ఈ పాలసీకి తనకు తప్పుగా ముడిపెడుతూ.. ఏఐ ద్వారా సృష్టించిన డీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫేక్ వీడియోలు, ఎడిట్ చేసిన క్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, సంబంధిత పోస్టులను డిస్​ప్లే చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై, ఆ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సృష్టించిన వారిపై చర్యలకు ఆదేశించాలని పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  గడ్కరీ కోరారు. ఈ మేరకు సివిల్ దావా వేయడానికి గడ్కరీకి బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్స్ విభాగంను కూడా ప్రతివాదులుగా చేర్చారు. 

సీజేపీ తరహాలో ‘ఈ20 జనతా పార్టీ..

పేపర్ లీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన కాక్రోచ్​జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమం తర్వాత.. ఇప్పుడు ఇథనాల్- బ్లెండెడ్ ఇంధనం(ఈ20)ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో 'ఈ20 జనతా పార్టీ' అనే కొత్త డిజిటల్ కమ్యూనిటీ పుట్టుకొచ్చింది. దీనికి సైతం ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫాలోవర్లు భారీ సంఖ్యలో పెరుగుతున్నారు. సోమవారం సాయంత్రం నాటికి ఈ పేజీకి 2 లక్షల 18 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ సంఖ్య నిమిష నిమిషానికి పెరుగుతోంది. 

ప్రధానంగా వాహనదారులకు తక్కువ ధరకు 100 శాతం అసలైన (అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్లెండెడ్) ఇంధనాన్ని ఎంచుకునే స్వేచ్ఛ కల్పించాలని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలని ఇందులో డిమాండ్​ చేస్తున్నారు. అయితే, ఈ20 ఇంధనం విషయంలో వెనక్కి వెళ్లే ఎలాంటి ప్రతిపాదన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఆధునిక ఇంధనమని చెబుతోంది. కాగా, ఈ20 ఇంధనం వల్ల వాహనాల మైలేజ్ పడిపోతోందని, ఇంజిన్లు దెబ్బతింటున్నాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు.