- విద్యార్థులపై పోలీసుల దాడిపై చర్చకు ప్రతిపక్షాల డిమాండ్
- నిరసనల మధ్యే యాంటీ పేపర్ లీక్ బిల్లును ప్రవేశ పెట్టిన మంత్రి
- విపక్ష ఎంపీల నినాదాలతో
- సభలు పలుమార్లు వాయిదా
- నేడు సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మరో రోజు వృథాగా గడిచిపోయింది. ప్రతిపక్ష ఎంపీల నినాదాలు, అధికార పక్షం ఎంపీల ప్రతినినాదాలతో ఉభయ సభలలో గందరగోళం నెలకొంది. సోమవారం ఉదయం సభ ప్రారంభమైన తర్వాత విద్యార్థులపై లాఠీఛార్జ్, బలప్రయోగంపై చర్చ జరపాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ నేతృత్వంలో ఎంపీలు ఆందోళన చేపట్టారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేయడం, లాఠీఛార్జ్ చేయడానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదేసమయంలో విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సభలోకి రావడంతో ఎన్డీయే కూటమి ఎంపీలు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.
మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి సభకు వచ్చిన ప్రధాన్‌కు వారు ఘనంగా స్వాగతం పలికారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్’ అంటూ పోటాపోటీగా స్లోగన్లు చేశారు. దీంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సభ సజావుగా సాగేందుకు సహకరించాలంటూ ఇరు పక్షాల ఎంపీలకు విజ్ఞప్తి చేశారు.
ఈ ఆందోళనల మధ్యే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ‘పబ్లిక్ ఎగ్జామ్స్ (అనైతిక కార్యకలాపాల నిరోధక) సవరణ 2026 బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఈ సమావేశాల్లోనే పాస్చేయించాలనే ఉద్దేశంతో చర్చకు సహకరించాలని ప్రతిపక్షాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. నిరసనలు ఆపి బిల్లుపై చర్చలో పాల్గొనాలని కాంగ్రెస్ ఎంపీలను కోరారు.
అమిత్‌షా క్షమాపణ చెప్పాలి..
నీట్ పేపర్ లీక్ కు నిరసనగా ‘సంసద్ చలో’ చేపట్టిన విద్యార్థులపై బలప్రయోగానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టారు. ఈ క్రమంలో స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. అధికార, ప్రతిపక్ష సభ్యులు తమ విభేదాలపై సామరస్యపూర్వకంగా చర్చించుకుని రావాలని, ఆ తర్వాత బిల్లుపై చర్చ చేపడదామని పేర్కొంటూ 3 గంటల సమయం ఇచ్చారు. ఆ తర్వాత సభను తిరిగి ప్రారంభించినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు తమ పట్టువీడలేదు.
ముందుగా విద్యార్థులపై దాడికి సంబంధించి సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దీంతో ఉభయ సభలూ పలుమార్లు వాయిదా పడ్డాయి. చివరకు సాయంత్రం 5 గంటలకు యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ చేపట్టేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించినా సభలో గందరగోళం నెలకొనడంతో కుదరలేదు. దీంతో ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరుగుతుందని, ఇందుకోసం ఆరు గంటలు కేటాయిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు.
