సంక్షోభం నుంచి సైబర్ క్రిమినల్స్ సంపద సృష్టించుకోవటం అంటే.. దేశ వ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలోనే వంట గ్యాస్ కోసం డిమాండ్ విపరీతంగా పెరిగింది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జనం గ్యాస్ సిలిండర్లు బుక్ చేయటంతోపాటు.. ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారు సైబర్ క్రిమినల్స్.. సంక్షోభం నుంచి సంపద సృష్టించుకుంటున్నారు. ఈ సంక్షోభం నుంచి సరికొత్త దోపిడీ ఐడియాలతో.. మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారు ఈ చీటర్స్. మహారాష్ట్రలో బయటపడిన గ్యాస్ సైబర్ మోసం ఇప్పుడు సంచలనంగా మారింది. అందర్నీ అప్రమత్తం చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రజలను దోచుకునేందుకు భలే ప్లాన్ వేశారు ఇద్దరు మహిళలు. థానే జిల్లాలోని కళ్యాణ్–దొంబివిలి మున్సిపాలిటీఈలో ఇద్దరు మహిళలు తాము మహానగర్ గ్యాస్ ప్రతినిధులుగా నమ్మించారు. గ్యాస్ బుకింగ్ కోసం ఏపీకే (APK) ఫైల్ డౌన్ లోడ్ చేయించి హ్యాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఏసీపీ సుహాస్ హెమాడే చెప్పిన వివరాల ప్రకారం.. గ్యాస్ ఏజెన్సీ ఫోన్ చేస్తున్నాం.. ఫైల్ డౌన్ లోడ్ చేసుకోవాలని బాధితులకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. గ్యాస్ కు సంబంధించిన సమాచారాన్ని అప్ డేట్ చేసుకోవాలని.. అందుకోసం యాప్ లో పూర్తి డీటెయిల్స్ ఫిల్ చేయాల్సిందిగా సూచించారు.
చెప్పింది చెప్పినట్లుగా ఫామ్ ఫిల్ చేసి.. బ్యాంక్ అకౌంట్ నెంబర్ తో సహా ఎంటర్ చేశారు. ఆ తర్వాత అకౌంట్ నుంచి 4 లక్షల రూపాయలు డెబిట్ అయినట్లుగా గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. దొంబివిలీ స్టేషన్ లో రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ స్కాం ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలోని నవీ ముంబైతో పాటు థానే జిల్లాలో జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎల్పీజీ షార్టేజ్ ను అడ్వాంటేజ్ గా తీసుకున్న ఫ్రాడ్ స్టర్స్ అమాయకులను గ్యాస్ బుకింగ్స్ పేరిట మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్యాస్ కొరత ఒక్క మహారాష్ట్రలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో హోటల్స్, హాస్టల్స్ లో గ్యాస్ లేక కట్టెలపొయ్యి వినియోగించాల్సిన పరిస్థితి ఉంది. సిటీలో గ్యాస్ సమస్య ఉండటంతో ఇక్కడ కూడా అలాంటి మోసాలు జరిగే అవకాశం ఉందని.. నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
