భ‌విష్య‌త్తులో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉండ‌కూడ‌ద‌ని కోరుకుంటున్నా..!

భ‌విష్య‌త్తులో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉండ‌కూడ‌ద‌ని కోరుకుంటున్నా..!

హైద‌రాబాద్: భ‌విష్య‌త్తులో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉండకూడ‌ద‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్. సికింద్రాబాద్, కార్కానాలోని ఆర్కే మ‌ద‌ర్ థెరిసా ఫౌండేష‌న్ ఎల్డ‌ర్స్ కేర్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో నిర్వ‌హించిన 74వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌‌ల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న‌.. రానున్న రోజుల్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉండ‌కూడ‌ద‌ని కోరుకుంటున్నాన‌న్నారు. ప్రతి ఒక్కరికి అమ్మ నాన్నలే మొదటి దేవుళ్ళని.. వారే మనకు ఆస్థి అన్నారు.

త‌ల్లిదండ్రుల‌ను బాగా చూసుకోవాలని.. చాలా మంది కమర్షియల్ వాల్యూస్ తో అమ్మనాన్నలను దూరం చేసుకుంటున్నారని తెలిపారు. అమ్మనాన్నలను చివరి వరకు చూసుకోవాల్సిన బాధ్య‌త పిల్ల‌ల‌దేన‌న్నారు. భ‌విష్య‌త్తులో వృద్ధాశ్ర‌మాలు అవసరం లేకుండా తల్లిదండ్రులను చూసుకోవాలన్నారు. ప్రతి ఒక్క‌రూ దేశం అభివృద్ధి కోసం కృషి చేయాల‌న్న సీపీ..అంద‌రికీ 74వ స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. కార్య‌క్ర‌మం అనంత‌రం వృద్దులకు పండ్లు పంపిణీ చేశారు సీపీ సజ్జనార్.