గచ్చిబౌలి: సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఆరుగురు అరెస్ట్... రూ.26.57 లక్షలు రికవరీ

గచ్చిబౌలి: సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఆరుగురు అరెస్ట్... రూ.26.57 లక్షలు రికవరీ
  •     మ్యూల్​ అకౌంట్లు సప్లై చేస్తున్నట్లు గుర్తింపు
  •    
  •     నిందితులు విశాఖపట్నం వాసులు

గచ్చిబౌలి, వెలుగు: సైబర్​నేరాల కోసం మ్యూల్​బ్యాంక్​అకౌంట్ల సరఫరా, బ్యాంక్​ అకౌంట్లలోని నగదును ఇతరుల ఖాతాలకు ట్రాన్స్​ఫర్​ చేస్తున్న ఆరుగురు సైబర్​నేరగాళ్లను సైబరాబాద్​సైబర్​ క్రైం​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి రూ.26.57 లక్షలు  రివకరీ చేసినట్లు డీసీపీ సాయి మనోహర్​ తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గండిపేట్​లో నివాసం ఉండే రియల్ ఎస్టేట్​వ్యాపారి సురేశ్​రెడ్డికి ఫేస్​బుక్​లో ట్రేడింగ్​కు సంబంధించిన యాడ్ వచ్చింది. 

దానికి ఆయన రెస్పాండ్​అవడంతో కీర్తి నాయుడు అనే మహిళ కాల్​చేసి, ఎల్లోరా అనే వాట్సాప్​ ట్రేడింగ్ గ్రూప్ లో యాడ్​చేసింది. తర్వాత సురేశ్​రెడ్డి మొదటి ట్రేడింగ్​లో రూ.10 వేలు పెట్టుబడి పెట్టాడు. మరో యువతి కాల్ చేసి మీకు మెంటార్​గా ఉంటానని చెప్పి, అతనికి ట్రేడింగ్​పై కొంత శిక్షణ ఇచ్చింది. గత ఫిబ్రవరిలో సదరు యువతి చెప్పినట్లు సురేశ్​రెడ్డి రూ.21.60 లక్షలు పెట్టుబడి పెట్టాడు. దీంతో అతనికి రూ.1.21 లక్షల ప్రాఫిట్​వచ్చినట్లు చూపెట్టారు. ఇది నమ్మిన సురేశ్​రెడ్డి మరోసారి రూ.21.90 లక్షలు పెట్టుబడి పెట్టగా.. రూ.2 కోట్లు ప్రాఫిట్ వచ్చినట్లు చూపించడంతో విత్​డ్రా చేసుకునేందుకు ప్రయత్నించాడు. 

సాధ్యం కాకపోవడంతో మెంటార్​ను సంప్రదించగా.. రూ.41 లక్షల ఐటీ కట్టాలని చెప్పడంతో.. సురేశ్​రెడ్డి వారు సూచించిన బ్యాంక్​ అకౌంట్లకు ఆ మొత్తాన్ని పంపించాడు. తర్వాత ట్యాక్స్​ల పేరుతో రూ.14.60 లక్షలు పంపాడు. ఇలా మొత్తం రూ.95 లక్షలు చెల్లించాడు. ఇంకా డబ్బులు అడుగుతుండటంతో మోసపోయానని గ్రహించి,  సైబర్​క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సైబర్​ నేరస్తులకు బ్యాంక్​ అకౌంట్లు సప్లై చేయడం, డబ్బులు విత్​డ్రా చేయడం చేస్తున్న విశాఖపట్నంకు చెందిన గౌతమ్​, పెంటయ్య, సాయికుమార్, సత్యనారాయణ, మంత్రి సాయికుమార్, ఉట్ల సత్యనారాయణలను అరెస్ట్​ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ పేర్కొన్నారు.