V6 News

సైబరాబాద్ లో ఫస్ట్ టైమ్.. డిజిటల్ అరెస్ట్ కేసులో నిందితుడి అరెస్ట్

సైబరాబాద్ లో ఫస్ట్ టైమ్.. డిజిటల్ అరెస్ట్ కేసులో నిందితుడి అరెస్ట్
  • రూ.12 లక్షల క్యాష్ సీజ్
  • కంబోడియాకు వెళ్లి మోసాలు చేస్తున్న జగిత్యాల యువకుడు

గచ్చిబౌలి, వెలుగు: కంబోడియాలో ఉంటూ ఇక్కడి వృద్ధులను ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో బెదిరించి లక్షల రూపాయలు కొల్లగొడుతున్న కేటుగాడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. శుక్రవారం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ టి. సాయి మనోహర్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. జగిత్యాల జిల్లా కట్లకుంట గ్రామానికి చెందిన గాజర్ల అవినాష్ (26) డేటా ఎంట్రీ ఉద్యోగం కోసం కంబోడియా వెళ్లి, అక్కడ భారతీయులను మోసం చేసే నెట్​వర్క్​లో చేరాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలానగర్​కు చెందిన సదానందం అనే వృద్ధుడికి ఫోన్ చేసి, అతని నంబర్​పై 17 కేసులు ఉన్నాయని భయపెట్టాడు. అనంతరం వీడియో కాల్​లో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో 15 రోజుల పాటు అతడిని నిర్బంధంలో ఉంచి, సుమారు రూ. 42 లక్షలను నాలుగు వేర్వేరు ఖాతాల్లోకి మళ్లించాడు.

బాధితుడి ఫిర్యాదుతో ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. ఇప్పటికే వైజాగ్, బాంబేలలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అవినాష్ మార్చిలో ఇండియాకు వచ్చినట్లు సమాచారం రావడంతో అదుపులోకి తీసుకుని, అతని వద్ద రూ. 12 లక్షల నగదు, పాస్​పోర్ట్, సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ అరెస్ట్ కేసులో నిందితుడిని పట్టుకుని నగదును సీజ్ చేయడం ఇదే తొలిసారి అని డీసీపీ తెలిపారు. ఈ మోసగాడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయన్నారు.