- రూ.12 లక్షల క్యాష్ సీజ్
- కంబోడియాకు వెళ్లి మోసాలు చేస్తున్న జగిత్యాల యువకుడు
గచ్చిబౌలి, వెలుగు: కంబోడియాలో ఉంటూ ఇక్కడి వృద్ధులను ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో బెదిరించి లక్షల రూపాయలు కొల్లగొడుతున్న కేటుగాడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. శుక్రవారం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ టి. సాయి మనోహర్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. జగిత్యాల జిల్లా కట్లకుంట గ్రామానికి చెందిన గాజర్ల అవినాష్ (26) డేటా ఎంట్రీ ఉద్యోగం కోసం కంబోడియా వెళ్లి, అక్కడ భారతీయులను మోసం చేసే నెట్‌వర్క్‌లో చేరాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలానగర్‌కు చెందిన సదానందం అనే వృద్ధుడికి ఫోన్ చేసి, అతని నంబర్‌పై 17 కేసులు ఉన్నాయని భయపెట్టాడు. అనంతరం వీడియో కాల్లో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో 15 రోజుల పాటు అతడిని నిర్బంధంలో ఉంచి, సుమారు రూ. 42 లక్షలను నాలుగు వేర్వేరు ఖాతాల్లోకి మళ్లించాడు.
బాధితుడి ఫిర్యాదుతో ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. ఇప్పటికే వైజాగ్, బాంబేలలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అవినాష్ మార్చిలో ఇండియాకు వచ్చినట్లు సమాచారం రావడంతో అదుపులోకి తీసుకుని, అతని వద్ద రూ. 12 లక్షల నగదు, పాస్‌పోర్ట్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ అరెస్ట్ కేసులో నిందితుడిని పట్టుకుని నగదును సీజ్ చేయడం ఇదే తొలిసారి అని డీసీపీ తెలిపారు. ఈ మోసగాడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయన్నారు.

