V6 News

సైబరాబాద్లో కల్తీ ముఠాలకు చెక్

సైబరాబాద్లో కల్తీ ముఠాలకు చెక్

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్​పరిధిలో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న ముఠాలపై సైబరాబాద్​పోలీసులు ఉక్కపాదం మోపుతున్నారు. కల్తీ ఆహారం తయారు చేస్తున్న కేంద్రాలపై దాడులు చేసి 4 నెలల్లో 22 కేసులు నమోదు చేసి 28 మంది నిందితులను అరెస్ట్​ చేశారు. రూ. 64 లక్షల విలువైన కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్​ఎన్​ఫోర్స్​మెంట్​వింగ్​అధికారులు జనవరి 1 నుంచి ఏప్రిల్​21 వరకు పలు ఆహార తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. ఇందులో బేకరీ ఉత్పత్తులు, స్వీట్లు, నమ్​కీన్, వంటనూనెలు, గోధుమ పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్​, మటన్​అండ్​చికెన్​ప్రొడక్ట్స్, ఐస్​క్రీమ్స్​, సాస్​ ఉన్నట్టు గుర్తించారు. అలాగే, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, సింథటిక్​ ఫుడ్​కల్సర్, కెమికల్స్​ ఉపయోగిస్తున్నట్లు తెలుసుకున్నారు. 

తండ్రీ కొడుకుల గలీజ్​ దందా..

వట్టినాగులపల్లిలో రూ.10 లక్షల విలువైన 5,026 లీటర్లు కల్తీ వంటనూనె, రూ.3 లక్షల విలువైన 5,192 సాధారణ గోధుమ పిండిని బ్రాండెడ్​ పేరుతో విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ఈ కేసులో తండ్రీ కొడుకులను నిందితులు కావడం గమనార్హం. సులభంగా డబ్బు సంపాదించేందుకు వీరు ఈ దందా చేస్తున్నట్టు చెప్పారు. మరో రెండు కేసుల్లో 9.57 లక్షల విలువైన 3809 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా 11 లక్షల విలువైన మూడు టన్నుల వినియోగించిన వంటనూనెను స్వాధీనం చేసుకున్నారు.  రెండు కేసుల్లో 8 లక్షల విలువైన ఐస్​ క్రీమ్​లను రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.