తీవ్ర తుఫానుగా ‘నిసర్గ’

తీవ్ర తుఫానుగా ‘నిసర్గ’
  • ముంబై వద్ద తీరం దాటే అవకాశం
  • గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు
  • ప్రజలంతా ఇంట్లోనే ఉండండి: సర్కార్‌‌

ముంబై: నిసర్గ తుఫాను బుధవారం ఉదయం తీవ్ర రూపం దాల్చింది. తీవ్ర తుఫానుగా మారిందని వాతావరణ అధికారులు చెప్పారు. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా తుఫాను కొనసాగుతోందని, బుధవారం మధ్యాహ్నం హరిహరేశ్వర్‌‌ – దామన్‌ మధ్య అలీబాగ్‌కు దగ్గర్లో తీరం దాటే అవకాశం ఉందని అన్నారు. తీరం దాటే సమయంలో గంటలకు 100 నుంచి 120 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఇప్పటికే కరోనాతో అతలాకుతలమవుతున్న ముంబై సిటీని ‘నిసర్గ’ తుఫాను వణికిస్తోంది. వారం పది రోజుల వ్యవధిలో దేశం ఎదుర్కొంటున్న రెండో తుఫాను ఇది. వందేళ్ల తర్వాత ముంబైకి తుఫాను ముప్పు రావడం ఇదే.

జనం రెండ్రోజులు బయటకు రావద్దు: సీఎం

నిసర్గ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో జనం రెండ్రోజుల పాటు బయటకు రావొద్దని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే విజ్ఞప్తి చేశారు. భారీ గాలి, వర్షాల కారణంగా పవర్‌‌ కట్‌ ఉంటుందని, దానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ముందుగానే సెల్‌ఫోన్లు, చార్జింగ్‌ లైట్లు సిద్ధంగా పెట్టుకోవాలని అన్నారు. ఈ మేరకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తుఫానును ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కరోనా పేషంట్లు సహా దాదాపు 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అన్నారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన, చేయకూడని పనులకు సంబంధించి బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ కొన్ని సూచనలు జారీ చేసింది. రూమర్స్‌ నమ్మొద్దని అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పింది. ముంబైలో సహాయక చర్యలకు 30 ఎన్డీఆర్‌‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. తుఫాను ప్రభావం గుజరాత్‌పై కూడా ఎక్కువగా ఉందని అన్నారు. ఈ మేరకు అక్కడ కూడా చర్యలు అనేక చర్యలు చేపట్టారు. సముద్ర తీరంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మహారాష్ట్ర, గుజరాత్‌ సీఎంలతో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని గురించి ఆరా తీశారు.