
- తీరాన్ని తాకని వాయు తుఫాను
- దిశ మార్చుకుని.. సౌరాష్ర్ట తీరం వెంబడి ముందుకు
- అయినా భారీ గాలులు, వర్షాలు కొనసాగుతాయి
- వాతావరణ శాఖ హెచ్చరిక
అహ్మదాబాద్/న్యూఢిల్లీ/తిరువనంతపురం: గుజరాత్‌కు గండం తప్పింది. అతి తీవ్ర తుఫానుగా మారిన ‘వాయు’ తన దిశను మార్చుకుంది. అరేబియా సముద్రంలోకి మళ్లింది. సౌరాష్ట్ర తీరం వెంబడి కదులుతోంది. అయితే పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) చెప్పింది. తీర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులు, వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించింది. ‘‘ఉత్తర-వాయువ్య దిశలో కొద్దిసేపు, వాయువ్య దిశలో కొద్దిసేపు సాగుతూ.. సౌరాష్ట్ర తీరం వెంబడి ‘వాయు’ ముందుకు సాగుతోంది. దీంతో తీర ప్రాంతాలైన గిర్ సోమ్‌నాథ్, డయ్యు, జునాగఢ్, పోర్‌బందర్, దేవభూమి–ద్వారకల్లో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. పెనుగాలులు 110 కిలోమీటర్ల కన్నా వేగంతో వీచే అవకాశం ఉంది” అని ఐఎండీ చెప్పింది. వెరవల్‌కు110 కిలోమీటర్ల దూరంలో, పోర్బందర్కు 150 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని గుజరాత్ అడిషనల్ చీఫ్ సెక్రెటరీ పంకజ్ కుమార్ చెప్పారు.
వచ్చే 60 గంటలు ముఖ్యం
వచ్చే 50–60 గంటలు చాలా ముఖ్యమని కోస్టు గార్డు అధికారులు చెప్పారు. మత్స్యకారులు, తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన 33 బృందాలు(ఒక్కో బృందంలో 90 నుంచి 100 మంది), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్)కు చెందిన 11 టీమ్‌లను 10 కోస్టల్ జిల్లాల్లో మోహరించినట్లు చెప్పారు. దీనికి అదనంగా 11 ఆర్మీ బృందాలు, రెండు బీఎస్ఎఫ్ టీమ్‌లు, 14 స్టేట్ రిజర్వ్ పోలీసు టీమ్‌లు, 300 మంది కమాండోలు కచ్, సౌరాష్ట్ర ఏరియాల్లో సిద్ధంగా ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాదాపు 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక 86 రైళ్లు పూర్తిగా, 37 రైళ్లు తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే ప్రకటించింది. కచ్, సౌరాష్ట్రల్లోని ఎయిర్‌పోర్టులు తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపేశాయి.
కేరళలో భారీ వర్షాలు
కేరళలో నైరుతి తన ప్రభావం చూపుతోంది. అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఎర్నాకులం, అలప్పుజా, తిరువనంతపురం, కోజికోడ్‌లలో భారీ వర్షాలు కురిసినట్లు ఐఎండీ తెలిపింది.
మనకు మంచిదే..
అరేబియా మహా సముద్రంలో వాయు తుఫాను కొనసాగుతుండటం వల్ల నైరుతి రుతుపవనాల మందగమనం కొనసాగింది. గాలిలోని తేమంతా తుఫాను ఉన్న ప్రాంతానికి వెళ్లిపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రాక ఆలస్యమైంది. ఎండలు కొనసాగాయి. అయితే తాజాగా గుజరాత్ తీరాన్ని తాకకుండా ‘వాయు’ వెళ్లిపోవడంతో రుతుపవనాల్లో కదలిక వస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి వేగం పెరుగుతుందని చెబుతున్నారు.
16–18 మధ్య రాష్ట్రానికి నైరుతి
ఈనెల 16 నుంచి 18 తేదీల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ రాజారావు తెలిపారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుఫాను వల్ల నైరుతి రాక లేట్ అయిందని చెప్పారు. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు ఎండలు కొనసాగుతాయని తెలిపారు. ఖమ్మంలో అత్యధికంగా42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణో గ్రత రికార్డయింది. రాష్ట్రంలోని పలు చోట్ల శుక్ర, శని వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షా లు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. వనపర్తి, సంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ , నారాయణపేట, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల,నాగర్ కర్నూల్ జిల్లాల్లో పలు చోట్ల వర్షం పడింది. – హైదరాబాద్, వెలుగు